Begin typing your search above and press return to search.

మహా 'రాష్ట్రపతి' పాలన..? నేటితో సీఎం తేలంకుటే అంతే?

అంటే.. సీఎం ప్రమాణం జరగాలి. అయితే, ఇప్పటివరకు అలాంటిదేమీ జరగలేదు. దీంతో రాష్ట్రపతి పాలన విధించాల్సిన పరిస్థితి వస్తుంది.

By:  Tupaki Desk   |   25 Nov 2024 1:31 PM GMT
మహా రాష్ట్రపతి పాలన..? నేటితో సీఎం తేలంకుటే అంతే?
X

మహారాష్ట్ర రాజకీయాలు ఎప్పుడూ ప్రత్యేకమే. దేశంలో వైశాల్యం పరంగా మూడో అతిపెద్ద రాష్ట్రమైన ఈ రాష్ట్రంలో రాజకీయ ఉద్ధండులు పాలన సాగించారు. వారిలో శరద్ పవార్ వంటి వారు ఒక ఉదాహరణ. దీనికితగ్గట్లే మహా రాజకీయాలు మహా మలుపులు తిరుగుతుంటాయి. వైశాల్యంలో నంబర్ 1, 2 రాష్ట్రాలైన రాజస్థాన్ (200), మధ్యప్రదేశ్ (234) కంటే మహారాష్ట్రలో అధికంగా (288) సీట్లు ఉన్నాయి. తాజా ఎన్నికల్లో బీజేపీ-శివసేన (శిందే)-ఎన్సీపీ (అజిత్ పవార్)లతో కూడిన మహాయుతి కూటమి 233 స్థానాల్లో అఖండ విజయం సాధించింది. బీజేపీ 132 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచింది.

సీఎం పీఠం ఎవరికి?

మహారాష్ట్రలో 2019లో జరిగిన ఎన్నికల్లోనూ 105 సీట్లతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. నాడు ఉమ్మడి శివసేన 56 స్థానాలు గెలుచుకుని సంపూర్ణ మెజారిటీ సాధించాయి. అయితే, ముఖ్యమంత్రి పదవిపై ఉమ్మడి శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే పేచీ పెట్టడంతో రాజకీయం మారిపోయింది. మరోవైపు ఆయన కాంగ్రెస్, ఉమ్మడి ఎన్సీపీలతో కలిసి మహా వికాస్ అఘాడీ కూటమిని ఏర్పాటు చేసి సీఎం అయ్యారు. 2022లో శివసేన ఏక్ నాథ్ శిందే చీల్చి బీజేపీతో కలిసి సీఎం అయ్యారు. 2023లో ఎన్సీపీని చీల్చి అజిత్ పవార్ వచ్చి చేరారు. అయితే, తాజా ఎన్నికల్లో బీజేపీ అధిక స్థానాలు నెగ్గడంతో సీఎం అయ్యేది ఎవరనే సందిగ్ధత నెలకొంది.

పెద్దన్న బీజేపీకేనా?

బీజేపీకి వాస్తవానికి శివసేన, ఎన్సీపీలతో పని లేకుండానే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల సామర్థ్యం ఉంది. కానీ, మిత్ర ధర్మం ప్రకారం వెళ్తుందని భావించాలి. కాగా, సీఎం పదవి మరోసారి తమకే దక్కాలని శిందే వర్గం పట్టుబడుతోంది. అజిత్ పవార్ వర్గం మాత్రం వెనక్కుతగ్గింది. దీంతో మాజీ సీఎం, ప్రస్తుత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ ను బీజేపీ సీఎం చేస్తుందనే ఊహాగానాలు వస్తున్నాయి.

ఈ రోజు ఏర్పాటు చేయాల్సిందే..

మహారాష్ట్ర అసెంబ్లీ గడువు మంగళవారంతో ముగియనుంది. దీంతో ఆ లోగానే కొత్త అసెంబ్లీ కొలువుదీరాల్సి ఉంది. అంటే.. సీఎం ప్రమాణం జరగాలి. అయితే, ఇప్పటివరకు అలాంటిదేమీ జరగలేదు. దీంతో రాష్ట్రపతి పాలన విధించాల్సిన పరిస్థితి వస్తుంది. అదే జరిగితే.. మహారాష్ట్రలో వరుసగా రెండోసారి ఎన్నికల తర్వాత రాష్ట్రపతి పాలన విధించినట్లు అవుతుంది. 2019 ఎన్నికల అనంతరం కూడా ప్రభుత్వం ఏర్పాటుపై ప్రతిష్ఠంభన నెలకొనడంతో రాష్ట్రపతి పాలన విధించారు.