Begin typing your search above and press return to search.

ముంబై హిట్ అండ్ రన్ కేసులో 'బుల్డోజర్' ఎంట్రీ!

ఈ క్రమంలో ఈ ఘటనలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

By:  Tupaki Desk   |   10 July 2024 1:30 PM GMT
ముంబై హిట్  అండ్  రన్  కేసులో బుల్డోజర్ ఎంట్రీ!
X

ముంబైలోని శివసేన నేత రాజేష్ షా కుమారుడు మిహిర్ షా మద్యం మత్తులో కారు నడిపి ఓ వివాహిత మరణించడానికి, ఆమె భర్త తీవ్రంగా గాయపడటానికి కారకుడైన ఘటన తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఘటనలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా తాజాగా బుల్డోజర్ ఎంట్రీ ఇచ్చింది.

అవును... ముంబై హిట్ అండ్ రన్ కేసు తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ శిండే ఆదేశాలతో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా తాజాగా ఎక్సైజ్ అధికారులు ఎంట్రీ ఇచ్చారు.

ఈ క్రమంలో నిందితుడు మిహిర్ షా (24) మద్యం తాగిన వైస్ – గ్లోబల్ తపస్ బార్ లోని కొంత భాగాన్ని ఎక్సైజ్ అధికారులు బుల్డోజర్ సాయంతో కూల్చివేశారు. ఆ బార్ ను సీజ్ చేసిన ఒక రోజు అనంతరం అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. ఈ బార్ యజమానుల వద్ద సరైన లైసెన్స్ లు కూడా లేవని, నిబందనలకు పూర్తి విరుద్దంగా ఈ బార్ ను నడుపుతున్నారని అన్నారు.

ఇందులో భాగంగా ప్రభుత్వ నియమాలు పాటించకుండా 25 ఏళ్ల కంటే తక్కువ వయసున్న యువతీ, యువకులకు మద్యం సరఫరా చేస్తున్నారనే ఆరోపణలతోనే బార్ ను కూల్చివేసినట్లు ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు. మరోపక్క మిహిర్ షా తండ్రి రాజేష్ షాను పార్టీకి చెందిన అన్ని పదవుల నుంచి తొలగించినట్లు శివసేన వర్గాలు తాజాగా వెల్లడించాయి.

కాగా... ఆదివారం ఉదయం 5:30 గంటల ప్రాంతంలో ముంబైలోని వర్లీ ప్రాంతంలో మిహిర్ షా మద్యం మత్తులో బీఎండబ్ల్యూ కారును వేగంగా నడుపుతూ వెళ్లి స్కూటీని ఢీకొట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఆ స్కూటీపై ప్రయాణిస్తున్న మహిళ మృతి చెందగా.. ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో నిందితుడు అక్కడ నుంచి పరారైపోయాడు.

దీంతో... ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో... అతడికి సహకరించిన పలువురిని అరెస్ట్ చేశారు. వీరిలో నిందితుడి తండ్రి రాజేష్ షా కూడా ఉన్నారు. ఈ క్రమంలో నిందితుడి కొసం 11 ప్రత్యేక బృందాలు గాలించగా.. ప్రమాదం జరిగిన 72 గంటల అనంతరం మిహర్ షా ను అరెస్ట్ చేశారు.