Begin typing your search above and press return to search.

అక్కడ 'ఉల్లి' దెబ్బ తగిలేది ఎవరికో ?!

దేశంలో వినియోగించే 40 శాతం ఉల్లి పంట మహారాష్ట్రలో పండుతుంది. ఆసియాలోనే అతి పెద్ద ఉల్లి మార్కెట్ లాసల్ గావ్ మహారాష్ట్రలోని నాసిక్ లో ఉంది.

By:  Tupaki Desk   |   11 May 2024 4:27 AM GMT
అక్కడ ఉల్లి దెబ్బ తగిలేది ఎవరికో ?!
X

ఈ దేశంలో ప్రభుత్వాలనే కూల్చిన ఘనత ఉల్లిగడ్డది. ఉత్తరాదిన అనేక ప్రభుత్వాలు ఈ ప్రమాదాన్ని ఎదుర్కొన్నాయి. అందుకే ఉల్లి ధరలు పెరగగానే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే సబ్సిడీ మీద తక్కువ ధరకు ప్రజలకు అందజేస్తాయి. మన ప్రతి వంటకంలో ఉల్లిపాయ ఉండాల్సిందే. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అన్న సామెత కూడా ఉంది. అయితే ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాలను ఈ ఉల్లిపాయ ఉడికిస్తున్నది. ఉల్లి రైతులు ఎవరి ఓటేస్తారో అర్ధం కాక రాజకీయ నాయకులు బెంబేలు ఎత్తుతున్నారు.

దేశంలో వినియోగించే 40 శాతం ఉల్లి పంట మహారాష్ట్రలో పండుతుంది. ఆసియాలోనే అతి పెద్ద ఉల్లి మార్కెట్ లాసల్ గావ్ మహారాష్ట్రలోని నాసిక్ లో ఉంది. కొన్ని నెలల క్రితం ఉల్లి ధరలు పెరగడంతో కేంద్రం ఎగుమతులపై 14 శాతం సుంకం విధించింది. అంతకుముందు డిసెంబరులో విదేశాలకు ఎగుమతిని నిలిపివేసింది. రైతుల నుండి నిరసన రావడంతో ఈనెల 4న సుంకం ఎత్తివేసింది. కనీస ఎగుమతి ధరను టన్నుకు 850డాలర్లుగా నిర్ధారించింది. అయితే దీని వల్ల కూడా తమకు ప్రయోజనంలేదని ఉల్లి రైతులు అంటున్నారు.

లాసల్‌గావ్‌కు దూలే, ధిండోరి, అహ్మద్‌నగర్‌, షిర్డీ, షిరూర్‌, బీడ్‌, మావల్‌ తదితర నియోజకవర్గాల రైతులు ఉల్లి పంటను తీసుకొస్తారు. వీటికి నాలుగు, ఐదో దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని 22 జిల్లాల పరిధి 13 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఉల్లి ఎక్కువగా సాగవుతుంది. వీటిలో సోలాపూర్‌, లాతూర్‌, బారామతి, ఉస్మానాబాద్‌లో ఈనెల 7న పోలింగ్‌ ముగిసింది.

ఉల్లి రైతుల ఆగ్రహం తెలిసి అక్కడి పౌరసరఫరాల మంత్రి చగన్ భుజభల్ ఉల్లి ఎగుమతుల మీద నిషేధం వెనక్కు తీసుకున్నట్లు ప్రచారంలో చెబుతున్నా రైతుల నుండి సానుకూల స్పందన రావడం లేదు. అలాగని విపక్షాలకు ఇక్కడ ఆదరణ లభించకపోవడం గమనార్హం. ఎన్నికలలో రైతులు తమ వైపు నిలబడతారన్న ఉద్దేశంతో శివసేన, కాంగ్రెస్ పార్టీలు ప్రభుత్వాన్ని నిలదీయలేదని, దీనిపై కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే మాజీ కేంద్ర మంత్రి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆందోళనకు దిగాడని ఉల్లి రైతుల సంఘం ఆరోపిస్తున్నది.

క్వింటాలు ఉల్లి గడ్డ రూ.2410 చొప్పున 2 లక్షల టన్నులు కొంటామన్న కేంద్రం చేతులెత్తేసిందని, 99,150 టన్నులను ఎగుమతి చేయాలన్న నిర్ణయం అమలుకాలేదని ఉల్లి రైతులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలలో వారు ఎవరిని గెలిపిస్తారు అన్నది ఉత్కంఠగా మారింది.