మహాసేన రాజేశ్ సంచలన ప్రకటన!
జనసేన పార్టీకి అనుకూలంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ వచ్చారు.
By: Tupaki Desk | 2 March 2024 10:22 AM GMTతాను వచ్చే ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్టు మహాసేన రాజేశ్ సంచలన ప్రకటన చేశారు. సోషల్ మీడియా, యూట్యూబ్ లో మహాసేన మీడియా అంటూ వివిధ అంశాలపై విశ్లేషణల ద్వారా సరిపెల్ల రాజేశ్ పాపులర్ అయ్యారు. గత ఎన్నికల ముందు ఆయన వైసీపీలో చేరారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఆశించారు. అయితే ఆ పదవిని వైఎస్ జగన్.. పెదపాటి అమ్మాజీకి కేటాయించారు.
దీంతో వైసీపీ నుంచి రాజేశ్ తప్పుకున్నారు. జనసేన పార్టీకి అనుకూలంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ వచ్చారు. ఆ పార్టీలో చేరతారని అంతా భావించారు. ఆయనపై తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ నేతలు దాడి చేసినప్పుడు స్వయంగా పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి రాజేశ్ ను పరామర్శించారు. దీంతో రాజేశ్ జనసేనలో చేరడం ఖాయమనుకున్నారు. అయితే ఏమైందో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన మొదటి జాబితాలో తూర్పుగోదావరి జిల్లాలోని పి.గన్నవరం సీటును రాజేశ్ దక్కించుకున్నారు.
అయితే వైసీపీలో ఉన్నప్పుడు రాజేశ్.. జనసేనాని పవన్ కళ్యాణ్ పైన, తదితరులపైన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.. ఇంకోవైపు పి.గన్నవరంలో స్థానికంగా ఉన్న టీడీపీ నేతలతోపాటు జనసేన శ్రేణులు సైతం రాజేశ్ కు టికెట్ ఇవ్వొద్దని ఇస్తే తాము పనిచేయబోమని ప్రకటించాయి.
కొద్దిరోజుల క్రితం పి.గన్నవరంలో టీడీపీ, జనసేన నేతలను కలవడానికి వచ్చిన రాజేశ్ ను టీడీపీలో మరో వర్గం అడ్డుకుంది. జనసేన పార్టీ కార్యకర్తలు టీడీపీ నేత గంటి హరీశ్ కారును పగులకొట్టారు. ఈ సమావేశంలో ఒకరిపై ఒకరు చెప్పులు విసురుకున్నాయి.
మరోవైపు హిందూ సం«ఘాలు సైతం అతడికి సీటు ఇస్తే ఓడిస్తామని తాజాగా ప్రకటించాయి.
ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల బరి నుంచి తాను తప్పుకుంటున్నానని రాజేశ్ ప్రకటించారు. సామాన్యుడికి అవకాశం రాగానే వ్యవస్థ మొత్తం ఏకమైందని వ్యాఖ్యానించారు. కులరక్కసి చేతిలో బలై పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. తన వల్ల పార్టీకి చెడ్డపేరు రావడం తనకిష్టం లేదన్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు.