Begin typing your search above and press return to search.

మహారాష్ట్రలో మహాయుతి మెరుపులు.. ఝార్ఖండ్ లో జేఎంఎం జిగేల్లు!

అవును... మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి.

By:  Tupaki Desk   |   23 Nov 2024 7:21 AM GMT
మహారాష్ట్రలో మహాయుతి మెరుపులు.. ఝార్ఖండ్  లో జేఎంఎం జిగేల్లు!
X

మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇటీవల జరిగిన హర్యానా, జమ్మూకశ్మీర్ తరహాలో ఇక్కడ ఫలితాలు ఉన్నాయని అంటున్నారు. ఇందులో భాగంగా... ఒక రాష్ట్రం (హర్యానా) లో బీజేపీ కూటమి దూకుడు కొనసాగించగా.. మరో చోట (జమ్మూకశ్మీర్) లో కాంగ్రెస్ కూటమీ హవా చూపించింది. ఇప్పుడు పరిస్థితీ అలానే ఉంది.

అవును... మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచీ మహాయుతి కూటమి మ్యాజిక్ చేస్తూనే ఉంది! ఎగ్జిట్ ఫలితాల అంచనాలను మించి ఆధిక్యంలో దూసుకుపోతోంది. మరోపక్క ఝార్ఖండ్ లో జేఎంఎం కూటమి ఎగ్జిట్ పోల్ ఫలితాలను తలకిందులు చేసి దూసుకెళ్తోంది.

ఇందులో భాగంగా... మహారాష్ట్రలో మహాయుతి కూటమి 216 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. వీటిలో... భారతీయ జనతాపార్టీ 124, శివసేన 56, ఎన్సీపీ 36 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. దీంతో... ఇదే ఫ్లో కంటిన్యూ అయితే... రికార్డ్ స్థాయి విక్టరీ కన్ ఫాం అని అంటున్నారు.

ఇక మహావికాస్ అఘాడీ కూటమి విషయానికొస్తే... ప్రస్తుతం 58 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇందులో భాగంగా... 101 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ 24 చోట్లా, 95 స్థానాల్లో పోటీ చేసిన శివసేన యూబీటీ 22 స్థానాల్లో, 86 స్థానాల్లో పోటీ చేసిన ఎన్సీపీ (ఎస్పీ) 12 స్థానాల్లో ముందంజలో ఉంది.

ఇక ఝార్ఖండ్ విషయానికొస్తే... 81 స్థానాల్లోనూ మ్యాజిక్ ఫిగర్ 41 కాగా... జేఎంఎం కూటమి ముందునుంచీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పుడు ఫ్లో ప్రకారం.. అద్భుతం జరిగితే తప్ప బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని అంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ జేఎంఎం కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటి ఆధిక్యంలో కొనసాగుతోంది.

ఇందులో భాగంగా... ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) కూటమి 51 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా... భారతీయ జనతాపాటీ కూటమి 29 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇక ఇతరులు ఒక స్థానంలో ముందంజలో ఉన్నారు!

ఇది ప్రజా తీర్పు కాదు!:

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో అధికార మహాయుతి కూటమి ఆధిక్యంలో మెజారిటీ మార్కు దాటేసింది. సుమారు 216 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతోంది. మహా వికాస్ అఘాడీ కూటమికి అందనంత దూరంలో వెళ్తోంది. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... ఇక్కడ ఏదో తప్పు జరిగినట్లు కనిపిస్తోందని.. ఆ తప్పు ఏమిటనేది అందరికీ అర్థమవుతోందని.. ఇది ప్రజల నిర్ణయం కాదని.. వారు కిరికిరీ చేసి సీట్లు దోచుకున్నారని.. ప్రజలు కూడా ఈ ఫలితాలతో ఏకీభవించడం లేదని.. ప్రతీ నియోజకవర్గంలోనూ క్యాష్ కౌంటింగ్ మెషిన్స్ పెట్టారని సంచనల వ్యాఖ్యలు చేశారు.

ఇదే సమయంలో... శిండేకు 60, అజిత్ పవార్ కు 40, భారతీయ జనతాపార్టీకి 125 సీట్లు వచ్చే అవకాశం ఉందా? అని ప్రశ్నించారు. అయితే... ఈ రాష్ట్ర ప్రజలు నిజాయతీపరులను.. వారిపై తమకు నమ్మకం ఉందని.. కానీ.. ఇది ప్రజా తీర్పు కాదని, అవకతవకలు జరిగాయంటూ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.