Begin typing your search above and press return to search.

ఆ ఎమ్మెల్సీ ఆ సీఎం కు వెరీ స్పెషల్.. ఎందుకో తెలుసా?

ఉమ్మడి ఏపీలోనే కాదు.. తెలంగాణలోనూ పెద్ద జిల్లా ఉమ్మడి పాలమూరు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నపుడు అనంతరపురంతో పాటు అత్యంత వెనుకబడిన జిల్లాగా మహబూబ్ నగర్ ను పేర్కొనేవారు.

By:  Tupaki Desk   |   5 April 2024 3:30 PM GMT
ఆ ఎమ్మెల్సీ ఆ సీఎం కు వెరీ స్పెషల్.. ఎందుకో తెలుసా?
X

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల మధ్యలో వచ్చాయి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత వచ్చిన తొలి ఎన్నికలు ఇవే. మరో కీలక అంశం కూడా ఈ ఎన్నికల్లో దాగి ఉంది. దీంతోనే పోలింగ్ రసవత్తరంగా సాగింది. అయితే, ఈ స్థానానికి ఉన్న ప్రత్యేకత తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం.

ఆయన పునాది అక్కడే

ఉమ్మడి ఏపీలోనే కాదు.. తెలంగాణలోనూ పెద్ద జిల్లా ఉమ్మడి పాలమూరు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నపుడు అనంతరపురంతో పాటు అత్యంత వెనుకబడిన జిల్లాగా మహబూబ్ నగర్ ను పేర్కొనేవారు. అయితే, అది ఓ 20 ఏళ్ల కిందటి సంగతి. ఇప్పటి పాలమూరు లెక్కే వేరు. అనేక విషయాల్లో ఇతర జిల్లాలను మించిపోయింది. ముఖ్యంగా భూముల ధరల్లో. హైదరాబాద్ కు దగ్గరగా ఉండడంతో ఈ జిల్లాలో ధరలు ఆకాశాన్ని అంటాయి. కాగా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లా వాసే. ఆయన స్వస్థలం వంగూరు మండలం కొండారెడ్డిపల్లె. కాగా, 2006లో రేవంత్ మిడ్డిల్ జడ్పీటీసీగా నెగ్గారు. ఈ సమయంలో ఆయనకు కాంగ్రెస్ మినహా అన్ని పార్టీలు మద్దతు ఇవ్వడం గమనార్హం.

6 నెలలకే ఎమ్మెల్సీ

మిడ్జిల్ జడ్పీటీసీ అయిన ఆరు నెలలకే 2007 తొలినాళ్లలో జరిగిన మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో రేవంత్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. అప్పటి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న సీనియర్ నాయకుడిని యువ రేవంత్ ఓడించి ఉమ్మడి ఏపీలో సంచలనం రేపారు. కాగా, నాడు సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖర్రెడ్డిని కూడా రేవంత్ గెలుపు ఆశ్చర్యపరిచింది. స్థానిక సంస్థల్లో మెజారిటీ ఉన్నప్పటికీ పాలమూరులో ఓటమికి కారణం ఏమిటనే దానిపై కాంగ్రెస్ విచారణ కమిటీని వేయడం గమనార్హం.

అటునుంచి టీడీపీలోకి..

మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ అయిన ఏడాదికే రేవంత్ రెడ్డి టీడీపీలో చేరారు. ఆపై 2009లో కొడంగల్ ఎమ్మెల్యేగానూ నెగ్గారు. అలా..అలా ఆ పార్టీ అధికార ప్రతినిధి నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయికి చేరారు. కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచి సీఎం స్థాయికి ఎదిగారు. ఇక రేవంత్ చట్టసభల ప్రస్థానానికి నాంది అయిన మహబూబ్ నగర్ ఎమ్మెల్సీకి ఆయన సీఎం అయిన సమయంలో ఉప ఎన్నిక రావడం విచిత్రమే. ఇక్కడినుంచి గతంలో ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలవడంతో స్థానం ఖాళీ అయింది. గత నెల 28న ఉప ఎన్నికకు పోలింగ్ నిర్వహించారు.

కాంగ్రెస్ దే గెలుపు..?

పాలమూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే గెలుపు అని స్పష్టం అవుతోంది. బీఆర్ఎస్ కు పైచేయి ఉన్నప్పటికీ రాష్ట్రంలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ సీటు కాంగ్రెస్ ఖాతాలోకే వచ్చే చాన్సుంది. దీనిని ఊహించే క్యాంపు రాజకీయాలు నిర్వహించారు.

కొసమెరుపు: రసవత్తరంగా పోలింగ్ జరిగిన పాలమూరు ఎమ్మెల్సీ ఫలితాల కోసం రెండు నెలలు ఆగాల్సిందే. కొన్ని గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమై.. గెలిచిన అభ్యర్థి పేరు ప్రకటిస్తారని భావిస్తున్న తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం అనుహ్య నిర్ణయం తీసుకుంది. సార్వత్రిక ఎన్నికల కోడ్ నేపథ్యంలో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికల ఫలితాలను తాత్కాలికంగా నిలిపివేసింది.