Begin typing your search above and press return to search.

కేటీఆర్ పై కాంగ్రెస్ అస్త్రం మహేందర్ రెడ్డి.. తట్టుకుని నిలబడేనా?

ఇక ఇప్పుడు మూడో జాబితాలో సిరిసిల్లా టికెట్ దక్కించుకున్న మహేందర్ రెడ్డి కూడా కేటీఆర్ ను ఎలా నిలువరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

By:  Tupaki Desk   |   7 Nov 2023 9:47 AM GMT
కేటీఆర్ పై కాంగ్రెస్ అస్త్రం మహేందర్ రెడ్డి..  తట్టుకుని నిలబడేనా?
X

తెలంగాణ ఎన్నికల్లో గెలుపు పై కన్నేసిన కాంగ్రెస్ ప్రచారంలో దూసుకెళ్తోంది. అధికార బీఆర్ఎస్ ను దాటి విజయం సాధించడం అంత సులువు కాదనే విషయం ఆ పార్టీకి తెలియంది కాదు. అందుకే అత్యుత్తమ వ్యూహాలు, ప్రణాళికలతో కాంగ్రెస్ సాగిపోతోంది. ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. వీళ్లను ఓడిస్తే సగం పని పూర్తయినట్లేనని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే కేసీఆర్ పై కామారెడ్డిలో రేవంత్ రెడ్డిని, గజ్వేల్లో తూంకుంట నర్సారెడ్డిని, సిద్ధిపేటలో హరీష్ రావుపై హరిక్రిష్ణను, తాజాగా సిరిసిల్లాలో కేటీఆర్ పై కేకే మహేందర్ రెడ్డిని కాంగ్రెస్ నిలబెట్టింది.

కామారెడ్డిలో కేసీఆర్ కు రేవంత్ రెడ్డి గట్టిపోటీనిచ్చే అవకాశముంది. గజ్వేల్ లో నర్సారెడ్డి కూడా గట్టి పోటీదారే. ఇక సిద్ధిపేటలో హరీష్ దూకుడును తట్టుకుని హరిక్రిష్ణ గెలుస్తారా? అన్నది సందేహమే. ఇక ఇప్పుడు మూడో జాబితాలో సిరిసిల్లా టికెట్ దక్కించుకున్న మహేందర్ రెడ్డి కూడా కేటీఆర్ ను ఎలా నిలువరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కేటీఆర్ కు సిరిసిల్లా గడ్డ పెట్టని కోట. ఇక్కడ కేటీఆర్ కు తిరుగేలేదు. 2009 నుంచి ఇక్కడ కేటీఆర్ వరుసగా గెలుస్తున్నారు. సిరిసిల్లాను తన కంచుకోటగా ఆయన మార్చుకున్నారు. ఈ సారి కూడా ఇక్కడ కేటీఆర్ దే గెలుపని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో కేటీఆర్ ను ఢీకొనే సత్తా మహేందర్ రెడ్డికి ఉందనే నమ్మకంతో కాంగ్రెస్ టికెట్ కేటాయించింది. మొదట టీఆర్ఎస్ లో కొనసాగిన మహేందర్ రెడ్డి.. కేసీఆర్ తో సన్నిహితంగా కొనసాగారు. కానీ 2009 ఎన్నికల్లో తనను కాదని కేటీఆర్ ను కేసీఆర్ నిలబెట్టడంతో మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరి పోటీ చేసి కేవలం 172 ఓట్లతో ఓడిపోయారు. 2010 ఉప ఎన్నికల్లో మరోసారి కేటీఆర్ చేతిలో పరాజయం పాలయ్యారు. 2018లోనూ మరోసారి కాంగ్రెస్ నుంచి పోటీచేసినా నిరాశ తప్పలేదు. కానీ మహేందర్ రెడ్డి ఆగిపోలేదు. నియోజకవర్గంలో పట్టుకోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరోసారి కేటీఆర్ ను ఢీ కొట్టబోతున్నారు.