Begin typing your search above and press return to search.

బీసీ సీఎం : విపక్షాన్ని టార్గెట్ చేస్తూ తానూ ఆ రంధిలోనే కాంగ్రెస్

ఆయనకు హైకమాండ్ అండదండలు కూడా పుష్కలంగా ఉన్నాయి. అయితే ఇటీవల కుల గణన తెలంగాణా ప్రభుత్వం చేపట్టింది.

By:  Tupaki Desk   |   18 Feb 2025 4:08 AM GMT
బీసీ సీఎం : విపక్షాన్ని టార్గెట్ చేస్తూ తానూ ఆ రంధిలోనే కాంగ్రెస్
X

తెలంగాణా కాంగ్రెస్ రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు అన్నది విశ్లేషకుల మాట. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయాలు అలా ఉంటాయి కాబట్టి అని అంటారు. తెలంగాణాలో కాంగ్రెస్ పదేళ్ళ సుదీర్ఘ విరామం తరువాత 2023 చివరిలో అధికారంలోకి వచ్చింది. డైనమిక్ లీడర్ గా ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణాకు కాంగ్రెస్ తరఫున తొలి సీఎం అయ్యారు. ఆయన గత పద్నాలుగు నెలలుగా తనదైన శైలిలో పాలన చేస్తున్నారు.

ఆయనకు హైకమాండ్ అండదండలు కూడా పుష్కలంగా ఉన్నాయి. అయితే ఇటీవల కుల గణన తెలంగాణా ప్రభుత్వం చేపట్టింది. అది తెలంగాణా రాజకీయాల్లో అతి పెద్ద చర్చకు దారి తీస్తోంది. దానికి మించిన చర్చ కాంగ్రెస్ రాజకీయాల్లోనూ సాగుతోంది. ఈ చర్చకు తావిచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే. ఆయన ఇటీవల ఒక సభలో మాట్లాడుతూ బీసీలకు న్యాయం చేయడంలో కాంగ్రెస్ నిబద్ధతను ఎవరూ శంకించాల్సిన పని లేదని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఏ రాజకీయ ప్రయోజనాల కోసమో ఆశించి పనిచేయదని చెప్పారు. తాను చివరి రెడ్డి సీఎం అయినా ఫికర్ లేదని భావించే కుల గణనను చేపట్టాను అని ఆయన అన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ అధినాయకత్వం సూచనలను త్రికరణ శుద్ధిగా అమలు చేశాను అని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రంగా తెలంగాణా ఈ కుల గణనను చేపట్టడం ద్వారా జాతీయ స్థాయిలో బీజేపీకి రాజకీయ సవాల్ విసురుతోంది.

అయితే ఇది ఇక్కడితో చాలదు, అత్యధిక జనాభాకు న్యాయం చేయడం ద్వారానే ఈ కులగణనకు సార్ధకత చేకూరుతుంది. దాంతోనే కాంగ్రెస్ పార్టీ మరింతగా దూకుడు ప్రదర్శించినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఇక కాంగ్రెస్ కి చూస్తే కర్ణాటకలో బీసీలే సీఎం గా ఉన్నారు. దాంతో తెలంగాణాలో అధిక సంఖ్యలో ఉన్న బీసీలను దగ్గర చేర్చుకునేందుకు కాంగ్రెస్ కొత్త ఎత్తుగడలు వేసినా ఆశ్చర్యం లేదనే అంటున్నారు.

పైగా తెలంగాణాలో అధికారం కోసం బీఆర్ఎస్ కాచుకుని కూర్చుంది. కేసీఆర్ అగ్ర సామాజిక వర్గానికి చెందిన వారు. ఇక బీజేపీలో కూడా అనివార్యంగా బీసీ నినాదాన్ని చూపించే విధంగా ఒత్తిడి పెంచాలంటే కాంగ్రెస్ బీసీ కార్డు ఉపయోగించినా చేయవచ్చు అన్నది ఒక ప్రచారంగా ఉంది. మరి రేవంత్ రెడ్డి కూడా తాను చివరి రెడ్డి సీఎం అయినా ఏమీ బాధ లేదు బీసీలకు న్యాయం జరగాలి అని చెప్పారు.

ఇపుడు చూస్తే తెలంగాణా కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా బీసీ సీఎం అన్న మాట చెబుతున్నారు. ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ నినాదం కుల గణన అని అన్నారు. ఆయన ఆలోచనల మేరకే తెలంగాణాలో దానిని చేపట్టామని చెప్పారు. అసలు ఎన్నికల ప్రచారంలో కూడా జనాలకు రాహుల్ ఇదే విధమైన హామీ ఇచ్చారు కాబట్టే సర్వే చేసి తాము నిలబెట్టుకున్నామని అన్నారు.

ఇక కుల గణన తరువాత వచ్చే నివేదికలో ఆ మీదట రిజర్వేషన్లలో చూసుకుని తెలంగాణా సీఎం ఎవరు అవుతారు అన్నది తేలుతుందని అన్నారు. అయితే మహేష్ కుమార్ గౌండ్ ఒక చిన్న కండిషన్ పెట్టారు. ఈ నాలుగేళ్ళూ రేవంత్ రెడ్డి సీఎం గా కొనసాగుతారని 2028 ఎన్నికల తరువాత కచ్చితంగా తెలంగాణాకు బీసీ సీఎం వస్తారని చెప్పారు.

బీసీలు సీఎం కావాలంటే ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే అవకాశం ఉందని వేరే పార్టీలు అందుకు కనీసంగా కూడా సాహసించవని కూడా ఆయన కామెంట్స్ చేశారు. ఇక రానున్న ఎన్నికలు బీసీల చుట్టే తిరుగుతాయని కూడా ఆయన అంటున్నారు. అయితే కులగణన రీ సర్వే తరువాత తెలంగాణా రాజకీయం ఏ రకమైన మలుపు తీసుకుంటుంది అన్నది కూడా చూడాల్సి ఉంటుందని అంటున్నారు.

కాంగ్రెస్ బీసీ సీఎం అంటే అది ఎన్నికల దాకా ఎందుకు ఇపుడే చూపించండని విపక్షాలు డిమాండ్ చేసినా చేస్తాయని అంటున్నారు. దానికి కారణం రేవంత్ రెడ్డిని వారంతా టార్గెట్ చేయడమే అని అంటున్నారు. ఇక కాంగ్రెస్ లో కూడా సీఎం ఆశలు పెట్టుకున్న వారు చాలా మందే ఉంటారు. ఇవన్నీ చూస్తూంటే మూడున్నరేళ్ళకు పైగా అధికారం కాంగ్రెస్ చేతిలో ఉండగా బీసీ సీఎం నినాదం ఏ రకమైన మలుపు తిప్పుతుందో చూడాల్సి ఉందని అంటున్నారు.