టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి విజయవంతంగా తన పదవిని నిర్వహించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 6 Sep 2024 2:24 PM GMTతెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి విజయవంతంగా తన పదవిని నిర్వహించిన సంగతి తెలిసిందే.టీపీసీసీ అధ్యక్షుడిగా ఉంటూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రేవంత్ రెడ్డి విశేష కృషి చేశారని కాంగ్రెస్ హై కమాండ్ నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. ఆ క్రమంలోనే టీపీసీసీ అధ్యక్షుడి నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి వరకు రేవంత్ రెడ్డి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. అయితే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత టీపీసీసీ అధ్యక్షుడి స్థానాన్ని భర్తీ చేసేదెవరు అన్న ఉత్కంఠ ఏర్పడింది.
టీపీసీసీ చీఫ్ హోదాలో ఆయన వారసుడిగా ఎవరు నియమితులవుతారు అన్నదానిపై సందిగ్ధత ఏర్పడింది. టీపీసీసీ చీఫ్ పదవి కోసం చాలామంది కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎదురు చూశారు. అయితే, తాజాగా కాంగ్రెస్ హై కమాండ్ టీపీసీసీ అధ్యక్షుడిగా బొమ్ము మహేష్ కుమార్ గౌడ్ ను నియమిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ను నియమిస్తున్నట్లుగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటన విడుదల చేశారు.
ఈ ఏడాది జులై 7వ తేదీతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పదవీకాలం ముగిసింది. దీంతో, ఆ పదవి కోసం కాంగ్రెస్ సీనియర్ నేతలు మధుయాష్కి గౌడ్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ తదితరులు పోటీపడ్డారు. అయితే, సామాజిక సమీకరణాలు, ఇతర కారణాల నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్ వైపు కాంగ్రెస్ హై కమాండ్ మొగ్గుచూపింది. ప్రస్తుతం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మహేష్ కుమార్ పని చేస్తున్నారు. వాస్తవానికి రెండు వారాల క్రితమే టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ పేరు ఖరారైనప్పటికీ...మిగతా వారిని బుజ్జగించి తాజాగా ఆ పేరును ప్రకటించారని తెలుస్తోంది.