Begin typing your search above and press return to search.

టీపీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ గౌడ్.. ఖాయమైన పదవి..? ఎవరీయన?

దీంతోనే టీపీసీసీ చీఫ్ గా వేరొకరిని నియమిస్తున్నారు.

By:  Tupaki Desk   |   2 July 2024 1:16 PM GMT
టీపీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ గౌడ్.. ఖాయమైన పదవి..? ఎవరీయన?
X

తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు రాష్ట్ర పార్టీ నాయకుడిగా వ్యవహరించేదెవరో ఓ స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. తొలి నుంచి ప్రముఖంగా వినిపిస్తున్న పేరు వైపే కాంగ్రెస్ అధిష్ఠానం మొగ్గుచూపినట్లు సమాచారం. ఎన్నో సమీకరణాలు, వడపోతల అనంతరం టీపీసీసీ సారథిని నియమించనున్నట్లు స్పష్టం అవుతోంది. ప్రస్తుత పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పదవీ కాలం ఈ నెల 7వ తేదీతో ముగియనుంది. ఆయన గత ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపి సీఎం అయ్యారు. ఇకపై పాలన మీద పూర్తిగా ఫోకస్ పెట్టాల్సిన సమయం వచ్చింది. దీంతోనే టీపీసీసీ చీఫ్ గా వేరొకరిని నియమిస్తున్నారు.

బీసీ నేతకు అవకాశం..

తెలంగాణ బీసీల్లో బలమైన సామాజికవర్గాలు నాలుగు ఒకటి మున్నూరు కాపు. రెండు గౌడ, మూడోది యాదవ్. నాలుగోది ముదిరాజ్. వీటిలో మున్నూరు కాపు, యాదవ్ లు కాంగ్రెస్ లో గతంలోలా బలంగా లేరు. మిగిలిన గౌడ వర్గం నేతకే టీపీసీ చీఫ్ పదవి దక్కనుంది. ప్రస్తుతం ఎమ్మెల్సీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేశ్ కుమార్ గౌడ్ ను టీ పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తే ఎలా ఉంటుందని అధిష్టానం భావిస్తోందని సమాచారం. మంగళవారం మహేశ్ గౌడ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. దీంతో ఆయనకే పీసీసీ చీఫ్ పదవి దక్కనుందని స్పష్టం అవుతోంది. అసలు అందుకే ఆయన ఢిల్లీ వెళ్లినట్లు అంచనా వేస్తున్నారు. కాగా, టీపీసీసీ చీఫ్ నియామకంతో పాటు మంత్రి వర్గ విస్తరణకూ కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టీపీసీసీని ఎస్సీకి ఇవ్వాలనుకుంటే ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, ఎస్టీకి ఇవ్వాలనకుంటే బలరామ్ నాయక్ ఇచ్చే అవకాశం ఉందని పార్టీలో ప్రచారం జరుగుతోంది. కానీ, రేసులో మాత్రం మహేశ్ కుమార్ గౌడ్ ముందున్నారు. ఇక బీసీకి టీపీసీసీ ఇస్తే ఎస్టీ లంబాడాకు చీఫ్ విప్ ఇవ్వడం ఖాయం. కాగా, బొమ్మ మహేశ్ గౌడ్ నిజామాబాద్ జిల్లాకు చెందినవారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు. మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్నారు. 1990ల్లోనే ఎన్ఎస్ యూఐ అధ్యక్షుడిగా పనిచేశారు. 58 ఏళ్ల మహేశ్ గౌడ్ పీసీసీ కార్యదర్శి, ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. నిజాబాబాద్ అర్బన్ నుంచి టికెట్ ఆశించినా దక్కలేదు. ఇప్పుడు టీపీసీసీ అధ్యక్ష పదవి దక్కించుకుంటున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే టీపీసీసీ చీఫ్ అంటే ముఖ్యమంత్రితో సమానం కావడం గమనార్హం.