మహీంద్రా.. ఇండిగో మధ్య '6E' లడాయి.. అసలేమైంది?
ఇంతకూ అసలేం జరిగింది? అన్న విషయంలోకి వెళితే.. నవంబరు 26న మహీంద్రా సంస్థ తన రెండు కొత్త ఎలక్ట్రికల్ కార్లకు సంబంధించిన ప్రకటన విడుదల చేసింది.
By: Tupaki Desk | 4 Dec 2024 10:30 AM GMTఇటీవల కాలంలో ఎప్పుడూ లేని విధంగా రెండు దిగ్గజ కంపెనీల మధ్య ట్రేడ్ మార్క్ రచ్చ రాజుకుంది. అయితే.. ఈ రెండు సంస్థలు ఎప్పుడూ ఏ వివాదానికి కాలుదువ్వే బ్యాక్ గ్రౌండ్ లేకపోవటం.. తాజా వివాదంలో ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. తాజా వివాదం ఈ రెండు సంస్థల మధ్య లడాయిని ఎక్కడికి తీసుకెళుతందన్నది ఆసక్తికరంగా మారింది. ఇంతకూ ఆ రెండు దిగ్గజ సంస్థలు ఏమిటి? అన్న విషయానికి వస్తే.. ఒకటి వాహన రంగంలో పేరున్న మహీంద్రాఅయితే మరొకటి దేశీయ విమానరంగంలో దిగ్గజంగా పేరున్న ఇండిగో.
ఇంతకూ అసలేం జరిగింది? అన్న విషయంలోకి వెళితే.. నవంబరు 26న మహీంద్రా సంస్థ తన రెండు కొత్త ఎలక్ట్రికల్ కార్లకు సంబంధించిన ప్రకటన విడుదల చేసింది. అందులో ఒకటి బీఈ6ఈ కాగా.. మరొకటి ఎక్స్ ఈవీ 9ఈ పేరుతో రెండు మోడళ్లను లాంఛ్ చేసింది. అయితే.. 6ఈ కోడ్ ను ఇండిగో తన విమాన సేవలకు అందిస్తున్న నేపథ్యంలో ఆ సంస్థ 6ఈ ట్రేడ్ మార్కును వినియోగించటంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతేకాదు.. మహీంద్రా సంస్థపై ఢిల్లీ హైకోర్టులో కేసు వేసింది. దీనిపై ఈ నెల తొమ్మిదిన విచారణ జరగనుంది.
మహీంద్రా తన ఈవీ వాహనాలకు 6ఈ ఎలా పెడుతుంది? అన్నది ఇండిగో ప్రశ్న. గడిచిన పద్దెనిమిదేళ్లుగా 6ఈ ట్రేడ్ మార్క్ ను వినియోగిస్తున్నామని.. అంతర్జాతీయంగా బలమైన గుర్తింపు ఉందని పేర్కొంది. 6ఈ అనేదిగా ఉన్నా.. ఇతర పదాలతో కలిపినా ఇండిగో మాత్రమే వాడాలని.. లేదంటే తమ విశ్వసనీయ భాగస్వాములతో డీల్స్ కుదుర్చుకున్నప్పుడు మాత్రమే మా వస్తువులు.. సేవలు వినియోగానికి వీలుంటుందని పేర్కొన్నారు.
6ఈని విడిగా కానీ ఏ రూపంలో అయినా అనధికారంగా వినియోగిస్తే.. అది ఇండిగో హక్కులు.. ప్రతిష్ఠ.. గుడ్ విల్ కు ఉల్లంఘనగానే భావించాల్సి ఉంటుందని ఇండిగో పేర్కొంది. ఇదిలా ఉంటే మహీంద్రా వాదన మరోలా ఉంది.
ఇండిగో లేవనెత్తిన అంశాల్ని తాము పరిశీలిస్తున్నామని.. తాము కావాలని ఆ పేరు పెట్టలేదని పేర్కొంది. క్లాస్ 12 కింద బీఈ6ఈ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ కోసం తాము అప్లై చేశామని.. ఇండిగోకు 6ఈ మాత్రమే ట్రేడ్ మర్క్ ఉందని.. తాము ఇతర పదాలతో కలిపి 6ఈని వాడుతున్నందున ఎలాంటి కన్ఫ్యూజన్ కు తావులేదన్నది మహీంద్రా వాదన. మహీంద్రా తన కొత్త మోడళ్లను ఫిబ్రవరి - మార్చిలో డెలివరీ ఇవ్వాల్సి ఉంటుంది. అంతలోపు కోర్టులో ఈ వివాదం ఒక కొలిక్కి వస్తుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.