Begin typing your search above and press return to search.

బహిష్కరణ వేటు చెల్లుతుందా ?

పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యురాలు మహువా మొయిత్రాపై లోక్ సభ సెక్రటేరియట్ వేటు వేసింది.

By:  Tupaki Desk   |   9 Dec 2023 4:16 AM GMT
బహిష్కరణ వేటు చెల్లుతుందా ?
X

పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యురాలు మహువా మొయిత్రాపై లోక్ సభ సెక్రటేరియట్ వేటు వేసింది. పార్లమెంటుకు సంబంధించి మొయిత్రా అనైతికంగా, అసభ్యంగా ప్రవర్తించిన కారణంగానే ఆమెను పార్లమెంటు నుండి బహిష్కరించినట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఈ విషయాన్ని బిర్లా ట్వీట్ ద్వారా చెప్పారు. ఎంపీని సభ నుండి బహిష్కరించాలని ఎథిక్స్ కమిటి చేసిన సిఫార్సును లోక్ సభ సెక్రటేరియట్ ఏకీభవించినట్లు చెప్పారు. ఆమెకు ఎంపీగా కొనసాగే అర్హత లేదని బిర్లా అభిప్రాయపడ్డారు.

మొయిత్రా బహిష్కరణ అంశాన్ని సభలో స్పీకర్ ప్రవేశపెట్టారు. పార్లమెంటు తీర్మానానికి మెజారిటి సభ్యులు సానుకూలంగా స్పందించారు. అయితే దీన్ని వ్యతిరేకిస్తు ప్రతిపక్ష సభ్యులు పార్లమెంటు సమావేశాలను బహిష్కరించారు. ఇపుడు విషయం ఏమిటంటే సభలో మెజారిటి ఉందనిచెప్పి అధికారపార్టీ లేదా కూటమి ఏమి చేయాలని అనుకుంటే అది చేసేస్తోంది. నిజానికయితే ఎంపీని బహిష్కరించే అధికారం లోక్ సభ స్పీకర్ కు కానీ లేదా పార్లమెంటుకు గాని లేదు.

ఎంపీపైన బహిష్కరణ వేటు పడాలన్నా, ఎంపీ పదవిపై అనర్హత వేటు పడాలన్నా అది కోర్టు ద్వారా మాత్రమే సాధ్యం. ఎంపీపైన ఉన్న ఆరోపణలు ఎలాంటివి అయినా కానీ అవి కోర్టులో నిరూపణ కావాలి. ఎంపీపైన అనర్హత వేటు వేయాలంటే నిర్ణయం తీసుకోవాల్సింది న్యాయస్ధానం మాత్రమే. ఎంపీలను సభనుండి సదరు సెషన్ వరకు మాత్రమే సస్పెండ్ చేసే అధికారం స్పీకర్ కు ఉంటుందంతే. పర్టిక్యులర్ సెషన్ నుండి మాత్రమే స్పీకర్ కూడా సస్పెండ్ చేయగలరు కానీ నెలల తరబడి సస్పెండ్ చేయలేరు. దీర్ఘకాలం సస్పెండ్ కూడా చేయలేని స్పీకర్ మొయిత్రాపైన ఏకంగా బహిష్కరణ వేటు ఎలా వేయగలరు ?

బహిష్కరణ వేటుకు వ్యతిరేకంగా మొయిత్రా కోర్టుకు వెళితే కోర్టు వెంటనే స్పీకర్ నిర్ణయంపై స్టే ఇచ్చే అవకాశముంది. ఎందుకంటే ప్రశ్నలు వేసినందుకు ఎంపీ డబ్బులు తీసుకున్నారన్నది ఎథిక్స్ కమిటి ఆరోపణ. అయితే డబ్బులు తీసుకుని ప్రశ్నలు వేయకూడదని ఎక్కడా లేదు. ఇది కేవలం నైతికతకు సంబంధించిన విషయం మాత్రమే. డబ్బులు తీసుకుని ప్రశ్నలు వేయటం నేరమని పార్లమెంటు తీర్మానం చేస్తే అప్పుడు అది నేరమవుతుంది, బహిష్కరణ వేటు వేసే అధికారం స్పీకర్ కు వస్తుందంతే. మరి మొయిత్రా ఏమి చేస్తారో చూడాలి.