కూటమి బలమా? వైసీపీ లోపమా? మున్సిపాలిటీల్లో ఎందుకు దెబ్బ పడింది!
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీపై ఫోకస్ చేయాల్సిన వైసీపీ అధిష్ఠానం ఆ పని గాలికి వదిలేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
By: Tupaki Desk | 4 Feb 2025 4:30 PM GMTఅసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత వైసీపీకి వరుస ఓటములే పలుకరిస్తున్నాయి. రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా కూటమి సునాయాశంగా విజయం సాధిస్తోంది. ప్రధానంగా వైసీపీకి బలం ఉన్న చోటా టీడీపీ కూటమినే జయకేతనం ఎగురవేయడం ఆసక్తికరంగా మారుతోంది. తాజాగా జరిగిన పది పట్టణ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో హిందుపురం మున్సిపాలిటీతోపాటు తిరుపతి, నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్లలోను నందిగామ, నూజివీడు వంటి మున్సిపాలిటీలు టీడీపీ కూటమి ఖాతాలోకి వెళ్లాయి. వాస్తవానికి ఈ అన్ని మున్సిపల్, నగర పాలక సంస్థల్లో సంఖ్యాపరంగా వైసీపీకే ఎక్కువ బలం ఉంది. కానీ, కూటమి గెలవడమే ఇక్కడి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సివస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీపై ఫోకస్ చేయాల్సిన వైసీపీ అధిష్ఠానం ఆ పని గాలికి వదిలేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా ఎదురైన పరాజయాలను విశ్లేషిస్తే అన్నిచోట్లా వైసీపీ నుంచి ఫిరాయించిన నేతలే ఆ పార్టీ అభ్యర్థులను ఓడించారు. అధికార కూటమిని గెలిపించారు. నాలుగేళ్ల క్రితం తాము గెలిపించామని చెప్పుకున్న కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఇప్పుడు పార్టీకి హ్యాండివ్వడం చర్చనీయాంశమవుతోంది. 2021 మార్చిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం చుట్టేసిన వైసీపీ.. ఇప్పుడు ఖాళీ అయిన స్థానాలను కాపాడుకోలేని దుస్థితికి చేరుకోవడం ఆ పార్టీ వైఫల్యంగా చెబుతున్నారు.
గతంలో చూపిన బలం ఇప్పుడు ఏమైందనే ప్రశ్న తలెత్తుతోంది. నాలుగేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో అధికార బలంతో గెలిపించుకుంటే... ఇప్పుడు అదే అధికార బలం టీడీపీ కూటమికి ఉండటం వల్ల అటువైపు విజయాలు నమోదవుతున్నట్లు విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి వైసీపీలో స్థానిక నేతలు ఇళ్ల నుంచి బయటకు రాకపోవడమే అన్నిచోట్ల పరాజయం పాలవ్వాల్సివచ్చిందని అంటున్నారు. ముఖ్యంగా ఏలూరు, నెల్లూరు కార్పొరేషన్లలో వైసీపీ నేతలు పత్తా లేకపోవడంతో ఆ కార్పొరేషన్లు టీడీపీ ఖాతాలో చేరాయి. అదేవిధంగా గుంటూరు కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీల ఎన్నిక సమయంలోనూ టీడీపీ నేతల చాణక్యం ఫలించిందని చెబుతున్నారు. నూజివీడులో మంత్రి పార్థసారధి, నందిగామలో ఎమ్మెల్యే సౌమ్య దగ్గరుండి తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్నారు. ఇదే సమయంలో ఒక్క తిరుపతిలో తప్ప మరెక్కడా వైసీపీ నేతలు కనిపించలేదు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు వైసీపీకి ఓ గుణపాఠంగా చెబుతున్నారు. మరో ఏడాదిలో జరిగే ఎన్నికలకు ఇవి రిహార్సిల్ అనుకుంటారో? లేక అధికారానికి తలొగ్గేస్తారో చూడాలని చర్చ జరుగుతోంది.