జగన్ ఇంకా మారాలి... మేకపాటి సంచలన వ్యాఖ్యలు.
అందువల్ల ప్రభుత్వం ఆ విషయంలో సరైన చర్యలు తీసుకోవాల్సిందే అన్నారు. మొత్తానికి చూస్తే మేకపాటి జగన్ కి చెప్పాల్సింది చెబుతూనే కొన్ని సూచనలు కూడా చేశారు.
By: Tupaki Desk | 21 Feb 2025 12:14 PM GMTవైసీపీకి పునాదుల నుంచి ఉన్న నాయకులలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఒకరు. ఆయన జగన్ సీఎం అవుతాడని ఆనాడే ఊహించారు. జగన్ కోసం ఆయన కాంగ్రెస్ తో విభేదించారు. తన పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసి ఉప ఎన్నికలను ఎదుర్కొన్నారు. అలా జగన్ వైసీపీ ఫ్యాన్ గుర్తు మీద పోటీ చేసి గెలిచిన తొలి ఎంపీ అయితే రెండవ ఎంపీగా మేకపాటి ఉన్నారు.
అంతే కాదు వైసీపీకి నెల్లూరు జిల్లాను కంచుకోటగా మార్చడంలోనూ ఆయన పాత్ర అత్యంత కీలకం. ఆయన వైసీపీలో 2019 ఎన్నికల వరకూ చురుకుగా ఉన్నారు. ఆ తరువాత తన బాధ్యతలను వారసుడు మేకపాటి గౌతం రెడ్డికి అప్పగించారు. ఆయన మంత్రిగా ఉంటూ నెల్లూరు జిల్లాలో మేకపాటి వారి హవాను చూపించారు. అయితే 2022లో గుండె పోటుతో ఆయన ఆకస్మికంగా మరణించారు.
దాంతో మేకపాటి కూడా వైరాగ్యంతో ఉండడంతో వైసీపీకి నెల్లూరు జిల్లాలో సరైన పెద్ద దిక్కు అన్న వారు లేకుండా పోయారు. ఇదిలా ఉంటే మేకపాటి గౌతం రెడ్డి మూడో వర్ధంతి సందర్భంగా నెల్లూరు వచ్చిన ఆయన ఈ సందర్భంగా ఒక యూట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
తన కుమారుడు గౌతం రెడ్డి మృతి తమకే కాకుండా వైసీపీకి తీరని లోటు అన్నారు. గౌతం రెడ్డి బతికి ఉంటే నెల్లూరు జిల్లాలో వైసీపీకి ఈ రాకమైన పరిస్థితి వచ్చి ఉండేది కాదని అన్నారు. అంతే కాదు తన తమ్ముడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామ నారాయణరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి పార్టీని వీడిపోయేవారు కానే కాదని అన్నారు.
మరో వైపు వైసీపీ అయిదేళ్ళ పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేసి కూడా ఓటమి పాలు అయింది అని అన్నారు. దాని వెనక కారణాలను విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇప్పటికే వైసీపీ అధినాయకత్వం ఆ దిశగా ఆలోచన చేయడం మంచి పరిణామనని ఆయన అంటూనే క్యాడర్ ని పట్టించుకుంటాను అన్న జగన్ వ్యాఖ్యలను స్వాగతించారు. అయితే ఇంకా చాలా విషయాలు ఉన్నాయని వాటి మీద పూర్తి స్థాయిలో సమీక్ష చేయాలని కోరారు.
జగన్ వయసు కేవలం యాభై ఏళ్ళే అని ఆయనకు రాజకీయంగా మరో పాతిక ముప్పయ్యేళ్ళ పాటు అవకాశం ఉందని అన్నారు. గతంలో జరిగిన పొరపాట్లను పునరావృత్తం కానీయకుండా జాగ్రత్త పడితే మళ్లీ వైసీపీకి అధికారం దక్కుతుందని పెద్దాయన చెప్పారు.
ఇక జగన్ అసెంబ్లీకి రారు అన్న దాని మీద మాట్లాడుతూ ఆయన ఎందుకు రారని తప్పకుండా వస్తారని మేకపాటి అన్నారు. జగన్ ఎపుడో ఒకపుడు అసెంబ్లీకి వస్తారని ఆయన అసెంబ్లీకి వస్తాను అంటే కాదనే వారు ఎవరని ఆయన వస్తే ఎవరైనా ఏమైనా చేస్తారా అని ప్రశ్నించారు.
ఇక గుంటూరు జిల్లా మిర్చీ యార్డులో జగన్ పర్యటన చేసిన సందర్భంగా ఆయనకు భద్రత కల్పించకపోవడం పట్ల మేకపాటి ఫైర్ అయ్యారు. జగన్ కి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉందని అది కల్పించడం తప్పనిసరి అని అన్నారు. అంతే కాదు జగన్ కి ఏమైనా అనుకోనిది జరిగితే ఆ నింద ఏవరు మోస్తారు అని ప్రశ్నించారు.
అందువల్ల ప్రభుత్వం ఆ విషయంలో సరైన చర్యలు తీసుకోవాల్సిందే అన్నారు. మొత్తానికి చూస్తే మేకపాటి జగన్ కి చెప్పాల్సింది చెబుతూనే కొన్ని సూచనలు కూడా చేశారు. వైసీపీ ఓటమికి కార్యకర్తలను పట్టించుకోకపోవడమే కాకుండా ఇంకా చాలా కారణాలు ఉన్నాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సో పెద్దాయన మాటలను వైసీపీ అధినేత పరిగణనలోకి తీసుకుంటే వైసీపీకి మంచి రోజులు వచ్చినట్లే అని అంటున్నారు.