నాకు మంత్రి పదవి రాలేదో.. దబిడిదిబిడే.. కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్చరిక
మల్ రెడ్డి రంగారెడ్డి గత కొంతకాలంగా మంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్నారు.
By: Tupaki Desk | 4 April 2025 5:37 AMమంత్రి పదవి ఇస్తారా? ఇవ్వరా.. అంటూ ఏకంగా అధిష్టానానికే హెచ్చరికలు జారీ చేశారు ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఇవ్వకుంటే తన దారి తాను చూసుకుంటానంటూ బెదిరింపులకు దిగారు. రాజీనామా చేస్తానంటూ తెగేసి చెప్పారు. దీంతో తెలంగాణ కేబినెట్ విస్తరణ వ్యవహారం రోజురోజుకూ ఊహించని మలుపులు తిరుగుతోంది. సామాజికవర్గాల సమతుల్యత పాటించడం అధిష్టానానికి తలనొప్పిగా మారడంతో విస్తరణ ఎప్పుడు జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే మంత్రి పదవుల కోసం ఆశావహుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. తాజాగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి మరోసారి తన డిమాండ్‌ను గట్టిగా వినిపించారు. తనకు మంత్రి పదవి ఇవ్వకపోతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆయన హెచ్చరించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
మల్ రెడ్డి రంగారెడ్డి గత కొంతకాలంగా మంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే రెడ్డి సామాజికవర్గంలో ఎక్కువ మంది ఆశావహులు ఉండటంతో ఆయన పేరు పరిశీలనలోకి రావడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి ఇవ్వకపోతే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, తన స్థానంలో వేరే సామాజికవర్గం నాయకుడిని పోటీ చేయించి గెలిపిస్తానని ఆయన అన్నారు. అంతేకాకుండా, ఆ నాయకుడికైనా రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రి పదవి ఇస్తారా? అని ఆయన ప్రశ్నించారు.
రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారు. మల్ రెడ్డి రంగారెడ్డి ఒక్కరే గెలిచారు. దీంతో జిల్లాకు ప్రాతినిధ్యం వహించే మంత్రి ఎవరూ లేకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే సీనియర్ నేత జానారెడ్డి సైతం రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలని అధిష్టానానికి లేఖ రాసినట్లు సమాచారం. జానారెడ్డి ఇప్పుడు పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ఆయన లేఖ మల్ రెడ్డికి కొంత ఊరటనిచ్చే అంశంగా కనిపిస్తోంది.
మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ కేబినెట్‌లో మరో ఇద్దరు బీసీలకు అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరడం గమనార్హం. ఇప్పటికే ఇద్దరు బీసీ మంత్రులు ఉన్నారని, మరో ఇద్దరికి అవకాశం ఇవ్వాలని ఆయన ప్రతిపాదించారు. అయితే రెడ్డి సామాజికవర్గం నుంచి కూడా మంత్రి పదవుల కోసం డిమాండ్లు కొనసాగుతుండటంతో అధిష్టానం ఎవరికి అవకాశం ఇస్తుందో వేచి చూడాలి.
మల్ రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ, రెడ్డి సామాజికవర్గంలో పోటీ ఎక్కువగా ఉండటం ఆయనకు ప్రతిబంధకంగా మారింది. అయితే జానారెడ్డి వంటి సీనియర్ నేత మద్దతు లభించడం ఆయనకు కొంత బలాన్ని చేకూర్చే అవకాశం ఉంది. మరి మల్ రెడ్డి రంగారెడ్డి చేసిన హెచ్చరిక అధిష్టానంపై ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి. ఒకవేళ ఆయన తన పదవికి రాజీనామా చేస్తే అది కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర పరిస్థితిని కలిగిస్తుందనడంలో సందేహం లేదు.