ఈ ఏడాదిలో 3 లక్షల మంది భారతీయుల్ని ఆ దేశానికి తీసుకెళ్లటమే టార్గెట్!
పర్యాటకులకు స్వర్గధామంగా.. భారతీయ టూరిస్టులతో కళకళలాడే మాల్దీవులు ఇప్పుడు వెలవెలబోతోంది.
By: Tupaki Desk | 5 Feb 2025 6:30 AM GMTనోరు పారేసుకోవటం అన్ని సందర్భాలకు సూట్ కాదు. ఈ విషయంలో మాల్దీవులకు చెందిన మంత్రులు చేసిన పనికి ఆ దేశం మూల్యం చెల్లిస్తోంది. దేశ ప్రధాని నరేంద్ర మోడీపై అక్కసుతో చేసిన వ్యాఖ్యలు.. దీనికి స్పందించిన భారతీయుల తీరుతో ఇప్పుడా చిట్టి దేశం విలవిలాడుతోంది. పర్యాటకులకు స్వర్గధామంగా.. భారతీయ టూరిస్టులతో కళకళలాడే మాల్దీవులు ఇప్పుడు వెలవెలబోతోంది.
ఇప్పుడా దేశాన్ని సందర్శించేందుకు భారతీయులు పెద్దగా ఆసక్తి చూపకపోవటంతో ఆ దేశ పర్యాటరంగంపై తీవ్ర ప్రభావానికి గురవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది 3 లక్షల మంది భారతీయ పర్యాటకుల్ని తమ దేశానికి తీసుకెళ్లేలా చేయాలన్న లక్ష్యాన్ని ఆ దేశం పెట్టుకున్నట్లుగా చెబుతున్నారు. గత ఏడాది దౌత్యపరమైన పంచాయితీ పెట్టుకున్న ఆ దేశం తీరుపై భారతీయులు అగ్రహాన్నివ్యక్తం చేయటమే కాదు.. ఆ దేశానికి టూరిస్టుగా వెళ్లే వారు తమ జర్నీలను కాన్సిల్ చేసుకోవటం తెలిసిందే.
ఆ దేశానికి వెళ్లే విదేశీ పర్యాటకుల్లో భారతీయులు మొదటి స్థానంలో ఉండేవారు. అయితే.. అదంతా 2023 నాటి లెక్కలు. ఎప్పుడైతే ఆ దేశ మంత్రులు ప్రధానమంత్రి మోడీపై నోరు పారేసుకున్నారో అప్పటి నుంచి ఆ దేశానికి వెళ్లే మనోళ్ల సంఖ్య బాగా తగ్గిపోవటం.. ఆ దేశానికి వెళ్లే పర్యాటకుల సంఖ్యలో ఆరో స్థానానికి చేరుకోవటం దీనికి నిదర్శనంగా చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో భారతీయుల కోసం ప్రత్యేక కార్యక్రమాల్ని నిర్వహించటం ద్వారా ఆకర్షించాలని ఆ దేశం భావిస్తోంది. ఇందులో భాగంగా క్రికెట్ సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేసే ప్రయత్నంతో పాటు.. భారత్ లోని మరిన్ని పాంతాల నుంచి పర్యాటకుల్ని తీసుకొచ్చేలా ఇరు దేశాల విమానయాన సంస్థలతో సంప్రదింపుల్ని ముమ్మరం చేసింది ఆ దేశం. అంతేకాదు.. ఒక బ్రాండ్ అంబాసిడర్ ను నియమించాలన్న యోచనలోనూ ఆ దేశం ఉంది. కొత్తగా చెన్నై.. ఫుణె.. కోల్ కతా లాంటి నగరాల నుంచి విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.
మోడీపై విమర్శలకు ముందు ఆ దేశానికి మనోళ్లు ఏడాదికి 2.09 లక్షల మంది వెళుతుండగా.. గత ఏడాది ఆ సంఖ్య 1.30 లక్షలకు పడిపోయింది. మోడీపై తమ మంత్రులు చేసిన వ్యాఖ్యలతో జరిగిన నష్టాన్ని గుర్తించిన ఆ దేశ అధ్యక్షుడు మయిజ్జు భారత్ లో పర్యటించటంతో పరిస్థితులు కాస్త కుదుట పడ్డాయి. ఈ నేపథ్యంలో భారత్ నుంచి పెద్ద ఎత్తున పర్యాటకుల్ని తీసుకొచ్చే దిశగా పథకాలు వేస్తున్నారు. ఈ ఏడాది ముగిసే నాటికి 3లక్షల మంది భారతీయ పర్యాటకుల్ని ఆకర్షించటమే లక్ష్యంగా మాల్దీవులు పెట్టుకుంది.మరి.. ఆ లక్ష్యాన్ని చేరుకుంటారా? లేదా? అన్నది చూడాలి.