మాల్దీవులు.. చింత చచ్చినా ఇంకా పులుపు చావలేదు!
ఇవి చాలవన్నట్టు కొద్ది రోజుల క్రితం చైనా గూడచర్యపు నౌకకు మాల్దీవుల్లో హాల్టింగ్ కు మహ్మద్ మెయిజ్జు అనుమతి ఇచ్చారు.
By: Tupaki Desk | 5 Feb 2024 7:33 AM GMTభారత్ కు దిగువన హిందూ మహాసముద్రంలో అతి చిన్న ద్వీప దేశమైన మాల్దీవులకు మహ్మద్ మెయిజ్జు అధ్యక్షుడిగా వచ్చినప్పటి నుంచి చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ఆయన తన తొలి విదేశీ పర్యటనకు చైనాను ఎంచుకోవడం గమనార్హం.
మరోవైపు మొదట నుంచి మాల్దీవులకు అన్ని రకాలుగా అండదండలు అందిస్తున్న భారత్ ను మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మెయిజ్జు ఇబ్బదిపెట్టే పనులకు పాల్పడుతూనే ఉన్నారు.
ఇటీవల అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే తమ దేశంలో ఉన్న భారత సైనికులను దేశం విడిచి వెళ్లిపోవాలని కోరిన సంగతి తెలిసిందే. అలాగే లక్షద్వీప్ లో భారత ప్రధాని మోదీ పర్యటనపై మాల్దీవుల మంత్రులు చేసిన వెటకారపు వ్యాఖ్యలపైనా మెయిజ్జు విచారం వెలిబుచ్చలేదు. పైగా మాల్దీవులు సార్వభౌమాధికార దేశమని.. తమను ఎవరూ బెదిరించలేరని తన వదరుబోతుతనాన్ని ప్రదర్శించారు.
ఇవి చాలవన్నట్టు కొద్ది రోజుల క్రితం చైనా గూడచర్యపు నౌకకు మాల్దీవుల్లో హాల్టింగ్ కు మహ్మద్ మెయిజ్జు అనుమతి ఇచ్చారు. తద్వారా భారత్ ను ఇరుకునపెట్టారు. ఇప్పుడు ఏకంగా మాల్దీవుల ఎకనామిక్ జోన్ సమీపంలో సముద్రంలో చేపలు పడుతున్న మూడు బోట్లను భారత ఆర్మీ అడ్డగించిందని, ఇందుకు వివరణ ఇవ్వాలని మాల్దీవుల ప్రభుత్వం భారత్ ను డిమాండ్ చేసింది. దీనిపై భారత ప్రభుత్వం ఇంకా స్పందించలేదు.
జనవరి 31న మాల్దీవుల ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)లోని హాలీఫు అటోల్ కి ఈశాన్యంగా 72 నాటికన్ మైళ్ల దూరంలోని సముద్ర జలాల్లో చేపల వేటలో ఉన్న తమ దేశ బోట్లను భారత నేవీ దళం అడ్డగించిందని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ తాజాగా ఒక ప్రకటనలో ఆరోపించింది. భారత నేవీ దళం తమ బోట్లను అడ్డుకున్న ప్రాంతం తమదేనని మాల్దీవులు ప్రకటించుకుంది.
అంతర్జాతీయ సముద్ర చట్టాలు, నిబంధనలను ఉల్లంఘిస్తూ, ముందస్తు సమాచారం లేదకుండా భారత నౌకాదళం తమ ఫిషింగ్ బోట్లను ఎక్కిందని మాల్దీవులు ఆరోపిస్తోంది. దీనిపై వివరణ ఇవ్వాలని భారత ప్రభుత్వాన్ని కోరింది. తమ బోట్లను అడ్డగించినందుకు ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది.