Begin typing your search above and press return to search.

కీలక దేశ అధ్యక్షుడికి చేతబడి!

అయితే ఇరుగుపొరుగు దేశాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలనే భారత్‌ విదేశాంగ విధానంలో భాగంగా భారత్‌.. మాల్దీవుల విషయంలో ఎప్పటిలానే ఉంది.

By:  Tupaki Desk   |   28 Jun 2024 7:36 AM GMT
కీలక దేశ అధ్యక్షుడికి చేతబడి!
X

భారత్‌ కు అత్యంత సమీపంలో హిందూ మహా సముద్రంలో ఉన్న కీలక ద్వీప దేశం.. మాల్దీవులు. గతంలో భారత్‌ కు అత్యంత సన్నిహిత దేశంగా కొనసాగిన మాల్దీవులకు మహ్మద్‌ ముయిజ్జు దేశ అధ్యక్షుడిగా వచ్చాక ఆ దేశ తీరులో మార్పు వచ్చింది. చైనాకు వంత పాడుతూ, ఆ దేశ అనుకూల వైఖరి తీసుకుంటూ భారత్‌ ను ఇబ్బంది పెట్టేలా ముయిజ్జు పలు నిర్ణయాలను తీసుకున్నారు.

అయితే ఇరుగుపొరుగు దేశాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలనే భారత్‌ విదేశాంగ విధానంలో భాగంగా భారత్‌.. మాల్దీవుల విషయంలో ఎప్పటిలానే ఉంది. అయినప్పటికీ ఆ దేశ అధ్యక్షుడి తీరు మారలేదు.

ఈ నేపథ్యంలో మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్‌ ముయిజ్జుపై ఇద్దరు మంత్రులు చేతబడి చేశారనే వార్త హాట్‌ టాపిక్‌ గా మారింది. ఈ మేరకు మాల్దీవులు వార్తా సంస్థలు కథనాలను ప్రచురించాయి. ఈ క్రమంలో చేతబడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు మంత్రులను ఆ దేశ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

చేతబడి ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేసినవారిలో పర్యావరణ శాఖలో సహాయ మంత్రిగా విధులు నిర్వహిస్తున్న షమ్నాజ్‌ సలీం, ఈమె మాజీ భర్త అయిన అధ్యక్షుడి కార్యాలయ మంత్రి ఆదం రమీజ్‌ ఉన్నారు. వీరిద్దరితోపాటు మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.

అధ్యక్షుడు మహ్మద్‌ ముయిజ్జుపై చేతబడి చేయించారన్న ఆరోపణలతో ఇద్దరు మంత్రులు అయిన పర్యావరణ శాఖ మంత్రి షమ్నాజ్, అధ్యక్ష కార్యాలయ మంత్రి రమీజ్‌ ను మంత్రి పదవుల నుంచి తొలగించారు.

అరెస్టు అయిన ఇద్దరు మంత్రులతోపాటు మరో ఇద్దరికి న్యాయమూర్తి ఏడు రోజుల కస్టడీ రిమాండ్‌ విధించారు.

గతంలో అధ్యక్షుడు మహ్మద్‌ ముయిజ్జు మాల్దీవుల రాజధాని మాలె సిటీ మేయర్‌ గా ఉన్నప్పుడు షమ్నాజ్, ఆమె మాజీ భర్త రమీజ్‌ మున్సిపల్‌ కౌన్సిలర్లుగా ముయిజ్జుతో కలిసి పనిచేయడం విశేషం.

అయితే ఇద్దరు మంత్రులు, తొలగింపు, వారి అరెస్టుపై పోలీసులు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. మీడియా, న్యూస్‌ పోర్టళ్లు మాత్రం కథనాలను ప్రచురించాయి. అలాగే తాజా పరిణామాలపై మాల్దీవులు ప్రభుత్వం కానీ, అధ్యక్షుడి కార్యాలయం కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

కాగా కొద్ది రోజుల క్రితం మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్‌ ముయిజ్జు భారత్‌ కు వచ్చారు. ఢిల్లీలో నరేంద్ర మోదీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంగా ఆయన ఆహ్వానం మేరకు ముయిజ్జు వచ్చారు. భారత్‌ తో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకుంటామని తెలిపారు.