Begin typing your search above and press return to search.

పార్లమెంటులో పిడిగుద్దులు గుద్దేసుకున్న ఎంపీలు

దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

By:  Tupaki Desk   |   30 Jan 2024 4:32 AM GMT
పార్లమెంటులో పిడిగుద్దులు గుద్దేసుకున్న ఎంపీలు
X

అనూహ్య పరిణామాలకు వేదికగా మారింది మాల్దీవుల పార్లమెంటు. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు.. దానికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారటమే కాదు విస్మయానికి గురి చేసేలా ఉన్నాయి. వీధి పోరాటానికి ఏ మాత్రం తీసిపోని రీతిలో.. తాము చట్టసభలకు ఎన్నికైన ఎంపీలమన్న విషయాన్ని మర్చిపోయిన నేతలు.. వీధి పోరాటాల్లో మాదిరి తోటి ఎంపీలపై పిడిగుద్దులు గుద్దుతూ.. పార్లమెంట్ ను రణరంగంగా మార్చేశారు. మాల్దీవులకు ప్రస్తుతం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న మహమ్మద్‌ ముయిజ్జు ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన ఓటింగ్ సందర్భంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మల్దీవుల కేబినెట్ లో తీసుకున్ నిర్ణయంపై పార్లమెంటులో ఓటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికార పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్.. విపక్ష ప్రొగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవుల ఎంపీల మధ్య మొదలైన వాగ్వాదం చివరకు తీవ్ర ఘర్షణగా మారింది. సభలో గందరగోళాన్ని క్రియేట్ చేసిన కొందరు ఎంపీలు.. పోడియంపైకి ఎక్కి స్పీకర్ కార్యకలాపాల్ని అడ్డుకున్నారు. కొందరు స్పీకర్ తో వాగ్వాదానికి దిగారు. దీనంతటికి మించి ఒక ఎంపీ అయితే.. స్పీకర్ కుర్చీకి దగ్గరగా వెళ్లి.. స్పీకర్ చెవి దగ్గర ట్రంపెట్ లాంటిది ఊదుతూ ఆయన్ను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు.

మరికొందరు ఎంపీలు బెంచీలపై నుంచి దూసుకెళ్లి స్పీకర్ ను నెట్టేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అధికార పార్టీ ఎంపీలు అడ్డుకోవటంతో పరిస్థితి అదుపు తప్పింది. అధికార.. విపక్షాలకు చెందిన ఎంపీలు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ.. ఒకరినొకరు తోసుకుంటూ కిందకు దొర్లిన వైనాలు షాకింగ్ గా మారాయి. కిందపడిన ఒక ఎంపీని మరో ఎంపీ కాలితో తన్నుతున్న దృశ్యాలు చూస్తే.. వీరు చట్టసభకు ఎన్నికైన ఎంపీలా? వీధి రౌడీలా అనుకోకుండా ఉండలేని పరిస్థితి. ఈ పరిస్థితికి మాల్దీవుల పార్లమెంటులో మెజార్టీ ఉన్న ప్రతిపక్ష పార్టీ (ఎండీపీ).. అధికార పార్టీకి చెందిన నలుగురు సభ్యుల్ని దేశాధ్యక్షుడు మంత్రివర్గంలోకి తీసుకోవటానికి తీర్మానాన్నిప్రవేశ పెట్టారు. దీన్ని ఆమోదించేందుకు నో చెప్పిన వైనంతో చోటు చేసుకున్న గందరగోళం.. తోపులాటకు దారి తీసింది. మాల్దీవుల పార్లమెంటులో చోటు చేసుకున్న పరిణామాల్ని చూసిన వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు.