"ఎమ్మెల్సీ కొమరయ్య".. ఈయన రికార్డులేంటో తెలుసా..?
ఉత్తర తెలంగాణ పరిధిలోని ఉమ్మడి కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో బీజేపీ మద్దతు పలికిన అభ్యర్థి మల్క కొమరయ్య ఘన విజయం సాధించారు.
By: Tupaki Desk | 4 March 2025 12:33 PM ISTతెలంగాణలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంచలన ఫలితం వచ్చింది. ఉత్తర తెలంగాణ పరిధిలోని ఉమ్మడి కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో బీజేపీ మద్దతు పలికిన అభ్యర్థి మల్క కొమరయ్య ఘన విజయం సాధించారు. ఉమ్మడి నల్లగొండ-వరంగల్-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో పీఆర్‌టీయూ టీఎస్ అభ్యర్థి పింగిళి శ్రీపాల్‌రెడ్డి నెగ్గారు. అయితే, వీరిద్దరూ సిటింగ్ అభ్యర్థులపైనే గెలిచినా మల్క కొమరయ్య గెలుపే ప్రత్యేకంగా నిలిచింది.
ఈ రెండు స్థానాలతో పాటు ఉమ్మడి కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఫిబ్రవరి 27న పోలింగ్ జరిగింది. బీజేపీ బలపరిచిన అభ్యర్థులు మూడు స్థానాల్లో బరిలో దిగారు. కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలోనే పోటీ చేసింది.
మల్క కొమరయ్య పీఆర్టీయూ(టీఎస్) అభ్యర్థి వంగ మహేందర్‌రెడ్డిపై 5,777 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. తొలి ప్రాధాన్య ఓట్లతోనే సిటింగ్ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డిపై ఆయన విజయం సాధించారు. రఘోత్తంరెడ్డి 428 ఓట్లు మాత్రమే సాధించారు. పోలైన ఓట్లలో 50 శాతానికి మించి (12,074) ఓట్లు విజేతకు రావాల్సి ఉండగా కొమరయ్యకు 12,959 వచ్చాయి. ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలో పీఆర్‌టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పింగిళి శ్రీపాల్‌రెడ్డి రెండో ప్రాధాన్య ఓట్లతో గెలుపొందారు. యూటీఎఫ్ సిటింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి రెండో స్థానంలో వచ్చారు.
ఎవరీ కొమరయ్య..??
టీచర్ ఎమ్మెల్సీగా మల్క కొమరయ్య విజయం కీలక పరిణామం అనే చెప్పాలి. 1959లో జన్మించిన కొమరయ్య హైదరాబాద్ లో ప్రముఖ విద్యావేత్త. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పల్లవి విద్యాసంస్థల అధినేత. పెద్దపల్లి జిల్లా బంధంపల్లిలో జన్మించిన కొమరయ్య ఇంజనీరింగ్ చదివారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే ఉద్దేశం స్కూళ్లు స్థాపించారు.
గత ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కొమరయ్య మల్కాజిగిరి బీజేపీ టికెట్ ను ఆశించారు. కానీ, ఈటల రాజేందర్ కు దక్కింది. అయినా పార్టీ పట్ల అంకితభావంతో ఉన్న కొమరయ్యను ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి గుర్తించారు. మరోవైపు కొమరయ్య గెలుపునకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. కొమరయ్యకు ఆర్ఎస్ఎస్ తో మంచి సంబంధాలు ఉండడం కలిసొచ్చింది. ఆర్థికంగా బలవంతుడైన కొమరయ్యకు బీజేపీలో మున్ముందు మంచి ప్రాధాన్యం దక్కుతుందనే మాట వినిపిస్తోంది.