లోకల్ వర్సెస్ నాన్ లోకల్... సిటీలో పోస్టర్ల కలకలం!
ఈ నేపథ్యంలో తాజాగా మల్కాజిగిరీ లోక్ సభ స్థానానికి సంబంధించి ఈ లోకల్ – నాన్ లోకల్ అంశానికి సంబంధించి ఇప్పుడు ఒక ఫోటో వైరల్ గా మారింది.
By: Tupaki Desk | 6 April 2024 7:15 AM GMTఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రత్యర్థులను టార్గెట్ చేయడానికి.. ఆయా అభ్యర్థులు రకరకాల అంశాలను లేవనెత్తుతుంటారనేది తెలిసిన విషయమే! సాధారణంగా... తాను గొప్పవాడిని, మంచి వాడిని అని చెప్పే స్థానంలో... ప్రత్యర్థి గొప్పవాడు కాదు, చెప్పడ్డవాడు అని చెప్పడం పరిపాటిగా మారిందని అంటున్నారు! పైగా ఇటీవల కాలంలో లోకల్, నాన్ లోకల్ అనే అంశం కూడా ఎన్నికల పోటీలో అతిముఖ్యమైన అంశాల్లో ఒకటిగా ఉందని అంటున్నారు!
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పలు నియోజకవర్గాల్లో నాన్ లోకల్ అభ్యర్థులకు ఆదరణ చాలా తక్కువగా ఉంటుందని.. స్థానికులకే ఆయా నియోజకవర్గాల ప్రజానికం పూర్తిగా మద్దతు తెలుపుతారని.. అభ్యర్థులంతా స్థానికులే అయితే అప్పుడు మిగిలిన అంశాలపై ఫిల్టరింగ్ జరుగుతుంటుందని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా మల్కాజిగిరీ లోక్ సభ స్థానానికి సంబంధించి ఈ లోకల్ – నాన్ లోకల్ అంశానికి సంబంధించి ఇప్పుడు ఒక ఫోటో వైరల్ గా మారింది.
అవును... మల్కాజిగిరి లోక్ సభ స్థానంలో మూడు పార్టీల మధ్య పోరు రసవత్తరంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ లో సత్తా చాటలేకపోయామని.. అందువల్ల ఈ ఎన్నికల్లో మల్కాజిగిరీ లోక్ సభ స్థానాన్ని కైవసం చేసుకుంటే ఆ ఏడు నియోజకవర్గాలూ గెలిచినట్లే అన్నట్లుగా కాంగ్రెస్ భావిస్తోందని అంటున్నారు. మరోపక్క గ్రేటర్ లో కారు ఎప్పుడు జోరు మీదే ఉంటుందని చెప్పాలని బీఆరెస్స్ భావిస్తోందని చెబుతున్నారు.
ఇంకోపక్క ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే భావిస్తోన్న నేపథ్యంలో... మల్కాజిగిరి గెలిచి మోడీకి గిఫ్ట్ ఇవ్వాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారని అంటున్నారు. ఈ సమయంలో అనూహ్యంగా లోకల్ - నాన్ లోకల్ పోస్టర్ ఒకటి వెలిసింది. ఈ పోస్టర్ లో రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లతో పాటు వారు.. ఈ నియోజకవర్గ ప్రజలకు ఎంత దూరంలో నివాసాలను కలిగి ఉన్నారన్నే విషయాలను పొందుపరచబడి ఉంది!
ఇందులో భాగంగా... బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటలను కలవాలంటే (హైదరాబాద్ టు హుజూరాబాద్) 166 కి.మీ., కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీతను కలవాలంటే (హైదరాబాద్ టూ చేవెళ్ల) 59 కి.మీ. దూరం వెళ్లాలి. అదే బీఆరెస్స్ అభ్యర్థి లక్ష్మారెడ్డిని కలవాలంటే (రాగిడి) సున్నా కి.మీ. పక్కా లోకల్ అని రాసిఉన్న పోస్టర్ దర్శనమిచ్చింది. దీంతో... ఈ పోస్టర్ ఇప్పుడు వైరల్ గా మారింది!