మల్లాది హ్యాపీ.. ఇక అసలు 'రాజకీయం' స్టార్ట్ .. !
వైసీపీ తరఫున ఆయన 2019 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నుంచి విజయం దక్కించుకున్నారు. ఈ ఏడాది ఈక్వేషన్లు మారడంతో ఆయనను తప్పించారు.
By: Tupaki Desk | 4 Dec 2024 4:25 AM GMTవిజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు.. ధైర్యం చేశారు. చాలా నెలల తర్వా త ఆయన నియోజకవర్గంలోకి అడుగులు వేశారు. అది కూడా నేరుగా రైతులను పలకరించారు. వారి నుంచి ప్రబుత్వం కొనుగోలు చేస్తున్న ధాన్యం వివరాలు తెలుసుకున్నారు. ఈక్రమంలో సర్కారు తీరుపై విమర్శలు గుప్పించారు. గడిచిన ఆరు మాసాల్లో.. ఇప్పటి వరకు వైసీపీ నుంచి ప్రజల్లోకి వచ్చిన ఏకైక నాయకుడు మల్లాది విష్ణు కావడంతో ఆ దిశగారాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది.
వైసీపీ తరఫున ఆయన 2019 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నుంచి విజయం దక్కించుకున్నారు. ఈ ఏడాది ఈక్వేషన్లు మారడంతో ఆయనను తప్పించారు. దీంతో అప్పటి నుంచి మౌనం అయిపోయిన మల్లాది .. కేవలం అడపా దడపా.. పార్టీ కార్యక్రమాలకు మాత్రమే పరిమితం అయ్యారు. దీనికి కారణం.. తన నియోజకవర్గంలో తనకు ప్రాధాన్యం లేక పోవడమే. ఈ విషయంపైనే గత రెండు నెలలుగా ఆయన పోరాటం చేశారు. అంతర్గతంగా జగన్‌కు తన మనసులో మాట చెప్పారు.
దీంతో సరే.. నీ నియోజకవర్గంలో నువ్వే చూసుకో! అనే హామీ లభించినట్టు తెలుస్తోంది. ఇక, తాజాగా ఆయన ప్రజల మధ్యకు వచ్చారు. ఇక్కడ పోటీ చేసి పరాజయం పాలైన వెల్లంపల్లి శ్రీనివాస్‌కు మాత్రం ఇంకా.. ఎలాంటిగ్రీన్ సిగ్నల్ లభించలేదు. దీంతో ఆయన వెయింటింగులో ఉన్నారు. మల్లాదికి.. మళ్లీ సెంట్రల్ నియోజకవర్గం బాధ్యతలు అప్పగించడంతో స్థానికంగా.. వైసీపీ కేడర్ అంతో ఇంతో బలోపేతం కావడం ఖాయమన్న వాదన కూడా వినిపిస్తోంది.
బలమైన బ్రాహ్మణ సామాజిక వర్గంతోపాటు రెడ్డిసామాజిక వర్గం కూడా.. మల్లాదికి ఆది నుంచి ఇక్కడ అండగా ఉంది. ఇదే ఆయనను 2009, 2019 ఎన్నికల్లో విజయం దక్కించుకునేలా చేసింది. ఇక, ఇప్పుడు మరోసారి అధినేత నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆయన పుంజుకున్నారు. అయితే.. ఇప్పుడే అసలు కష్టాలు కూడా మొదలు కానున్నాయన్న చర్చ సాగుతోంది.
గతంలో 2014-15 మధ్య మల్లాదికి చెందిన బార్ లో మద్యం తాగి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం దీనిపై విచారణ వేసింది. కానీ.. తర్వాత.. అది ఏమైందో తెలియదు. ఇప్పుడు కనుక ఆయన రాజకీయంగా పుంజుకుంటే.. ఈ కేసును తిరగదోడే అవకాశం ఉందని.. అంటున్నారు పరిశీలకులు. రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు కాబట్టి.. మల్లాది ఎలాంటి స్టెప్ వేస్తారో చూడాలి.