Begin typing your search above and press return to search.

వెల్లంపల్లి ఆఫీసుకు వెళ్లాలన్న మల్లాది విష్ణు మాటలతో రియాక్షన్ ఇలా

తాజాగా గాయాత్రీ కన్వెన్షన్ హాల్ లో నిర్వహించిన సమావేశంలో వెల్లంపల్లి ఆఫీస్ కు వెళ్లే అంశంపై చర్చకు పెట్టిన మల్లాది విష్ణును నో అంటే నో చెప్పేస్తున్నారు.

By:  Tupaki Desk   |   25 Jan 2024 4:32 AM GMT
వెల్లంపల్లి ఆఫీసుకు వెళ్లాలన్న మల్లాది విష్ణు మాటలతో రియాక్షన్ ఇలా
X

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అధికార పార్టీలో నెలకొన్న పీఠముడిని వీలైనంత త్వరగా విప్పాలని.. లేదంటే పార్టీకి జిబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయన్న వాదన అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల్ని చూసిన తర్వాత.. పార్టీలోని అంతర్గత విభేదాలు మరింత ముదురుతున్న విషయం ఇట్టే అర్థమవుతుంది. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే టికెట్ ను మల్లాది విష్ణుకే ఇవ్వాలంటూ ఆయన వర్గానికి చెందిన అనుచరులు.. మద్దతుదారులు తాజాగా చేసిన హడావుడి పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి కొత్త ఇంఛార్జిగా ఎంపిక చేసిన వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆఫీస్ ఓపెనింగ్ కు వెళ్లాల్సి ఉంటుందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తన మద్దతుదారులకు మీటింగ్ పెట్టి చెప్పినంతనే తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఎట్టి పరిస్థితుల్లో వెల్లంపల్లి ఆఫీసు ఓపెనింగ్ కు వెళ్లకూడదంటూ మల్లాది విష్ణుపై ఒత్తిడి తేవటం షురూ అయ్యింది.

తాజాగా గాయాత్రీ కన్వెన్షన్ హాల్ లో నిర్వహించిన సమావేశంలో వెల్లంపల్లి ఆఫీస్ కు వెళ్లే అంశంపై చర్చకు పెట్టిన మల్లాది విష్ణును నో అంటే నో చెప్పేస్తున్నారు. ఈ ప్రతిపాదనను చర్చకు పెట్టినంతనే మల్లాది విష్ణు అనుచరులంతా తీవ్ర ఆగ్రహానికి గురై.. ఎట్టి పరిస్థితుల్లో వెల్లంపల్లి ఆఫీసుకు వెళ్లేది లేదంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయటమే కాదు ఆందోళన చేపట్టటం హాట్ టాపిక్ గా మారింది.

మల్లాది విష్ణుకు తప్పించి మరెవరికీ తాము మద్దతు ఇచ్చేది లేదంటూ నినాదాలు చేయటం.. రోడ్లపై బైఠాయించటంతో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అసలేం జరుగుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి బాధ్యులుగా వెల్లంపల్లి శ్రీనివాస్ ను నియమించటంపై స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు అసంత్రప్తికి గురైన నేపథ్యంలో.. పార్టీ ముఖ్యులు వచ్చి ఆయన్ను బుజ్జగించటం తెలిసిందే. దీంతో మల్లాది విష్ణు కాస్తంత సమాధానపడినప్పటికి.. ఆయన క్యాడర్ మాత్రం ససేమిరా అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మల్లాదివిష్ణును తప్పించి మరొకరిని అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు.

మల్లాదికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఆయన క్యాడర్ మాత్రం అందుకు అంగీకరించటం లేదు. తాజా పరిణామాలతో మరోసారి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై పార్టీ అధినాయకత్వం మరింత ఫోకస్ చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. లేని పక్షంలోనూ అనూహ్య పరిణామాలకు అవకాశం ఉంటుందన్న మాట వినిపిస్తోంది.