Begin typing your search above and press return to search.

అరుదైన కలయిక : కేటీఆర్ తో తీన్మార్ మల్లన్న!

దీంతో రాజకీయంగా శూనత్య ఏర్పడ్డ స్థితిలో తీన్మార్ మల్లన్న అడుగులు బీఆర్ఎస్ వైపు పడబోతున్నట్టుగా తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   17 March 2025 1:56 PM IST
అరుదైన కలయిక : కేటీఆర్ తో తీన్మార్ మల్లన్న!
X

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు అంటారు. ఆ నానుడి ఈరోజు తెలంగాణ పాలిటిక్స్ చూస్తే అచ్చుగుద్దినట్టుగా అర్థమవుతోంది. ఎందుకంటే కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ లకు వ్యతిరేకంగానే తీన్మార్ మల్లన్న పురుడుపోసుకున్నారు. వీ6లో మొదలైన ఆయన ప్రస్తానం.. బీఆర్ఎస్ నేతలను తిట్టడంతోనే ఎదిగింది. అదే ఆయనను కాంగ్రెస్ కు దగ్గర చేసింది. గత ఎన్నికల్లో ఎమ్మెల్సీని చేసింది. అయితే ఆ రెబలిజమే ఇప్పుడు తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ నుంచి సాగనంపేలా చేసింది. దీంతో రాజకీయంగా శూనత్య ఏర్పడ్డ స్థితిలో తీన్మార్ మల్లన్న అడుగులు బీఆర్ఎస్ వైపు పడబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు ఈరోజ కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.

రాజకీయాలు ఎప్పుడూ ఊహించని మలుపులు తిరుగుతాయి. ఎప్పుడు ఎవరు ఎవరితో కలుస్తారో, ఎవరితో విభేదిస్తారో చెప్పడం చాలా కష్టం. తెలంగాణ రాజకీయాల్లో అలాంటి అనూహ్యమైన సన్నివేశమే ఒకటి ఆవిష్కృతమైంది. ఒకప్పుడు బద్ధ శత్రువులుగా ఉన్న తీన్మార్ మల్లన్న, కేటీఆర్, హరీష్ రావు ఒకే వేదికపై కలిశారు.

తీన్మార్ మల్లన్న... ఈ పేరు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం. తన వాక్చాతుర్యంతో, నిర్భయమైన మాటలతో ప్రజల్లో చెరగని ముద్ర వేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ కుటుంబంపై, వారి విధానాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రభుత్వాన్ని నిలదీశారు. దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసి జైలుకు పంపింది. అయినా ఆయన తన పోరాటాన్ని ఆపలేదు.

జైలు నుంచి బయటకు వచ్చాక మరింత ఉత్సాహంతో విమర్శలు కొనసాగించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కానీ అక్కడ కూడా ఆయన శైలి మారలేదు. సొంత పార్టీ ప్రభుత్వాన్ని కూడా విమర్శించారు. కుల గణనలో తప్పులున్నాయని, బీసీలకు న్యాయం జరగడం లేదని గట్టిగా మాట్లాడారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆయనను బహిష్కరించింది.

ఇలాంటి పరిస్థితుల్లోనే తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులను కలిశారు. బీసీ రిజర్వేషన్ బిల్లుపై మద్దతు కోరారు. ఢిల్లీలో తాము తలపెట్టిన ధర్నాకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ భేటీ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒకప్పుడు తీవ్రంగా విమర్శించుకున్న నేతలు ఇలా కలవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని మరోసారి రుజువైంది.

తీన్మార్ మల్లన్న, కేటీఆర్, హరీష్ రావుల కలయిక వెనుక అనేక రాజకీయ కోణాలున్నాయి. బీసీ రిజర్వేషన్ బిల్లుపై పోరాటం, రాబోయే ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు, వ్యక్తిగత సంబంధాలు... ఇలా ఎన్నో అంశాలు ఈ భేటీకి కారణం కావచ్చు.

ఏదేమైనా, ఈ భేటీ తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాలి.