Begin typing your search above and press return to search.

పార్టీ మార్పుపై మాజీమంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు

తెలంగాణ బీఆర్ఎస్ రాజకీయాల్లో ఎంతగానో యాక్టివ్‌గా ఉండే లీడర్ మాజీ మంత్రి మల్లారెడ్డి.

By:  Tupaki Desk   |   9 Sep 2024 11:30 AM GMT
పార్టీ మార్పుపై మాజీమంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు
X

తెలంగాణ బీఆర్ఎస్ రాజకీయాల్లో ఎంతగానో యాక్టివ్‌గా ఉండే లీడర్ మాజీ మంత్రి మల్లారెడ్డి. ఆయన ఏ సందర్భంలో ఏది మాట్లాడినా అది సెన్సేషనలే. అలాంటి మల్లారెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసారి తన పార్టీ మార్పుపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

గతంలో తెలుగుదేశం పార్టీలో కొనసాగిన మల్లారెడ్డి.. ఆ తరువాతి పరిణామాలతో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ ప్రభుత్వం కేబినెట్లో మంత్రిగా కొనసాగారు. దాంతో అప్పటి నుంచి ఆయన ఏదో ఒకటి చేస్తూ మీడియా దృష్టిని ఆకర్షించేవారు. డ్యాన్సుల్లోనూ.. స్పీచుల్లోనూ ఆసక్తికర కామెంట్స్ చేస్తూ పతాక శీర్షికన చేరేవారు. అటు తన విద్యాసంస్థలను నడిపిస్తూనే.. ఇటు రాజకీయాల్లోనూ యాక్టివ్‌గా కొనసాగుతున్నారు. అయితే.. చాలా కాలంగా ఆయన పార్టీ మారబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

నిన్న తిరుపతికి చేరుకున్న మాజీమంత్రి మల్లారెడ్డి కాలినడకన కొండపైకి చేరుకున్నారు. ఈరోజు తిరుమల తిరుపతి దేవుడిని దర్శించుకున్న అనంతరం మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మార్పుపై క్లారిటీ ఇవ్వాలని మీడియా కోరగా.. ‘నేను పార్టీ మారలేదు. సమయం వచ్చినప్పుడు చెబుతాను’ అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చారు.

అయితే సమయం వచ్చినప్పుడు చెబుతాను అని అనడంతో పార్టీ మార్పు ఖాయమా అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మల్లారెడ్డి ఆ వ్యాఖ్యలతో ఆగిపోకుండా.. అటు చంద్రబాబుపైనా ప్రశంసల వర్షం కురిపించారు. 74 ఏళ్ల వయసులోనూ చంద్రబాబు ప్రజల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారని కొనియాడారు. తెలంగాణలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని, కేసీఆర్, కేటీఆర్ తెలంగాణను అభివృద్ధి చేస్తారనే నమ్మకం ఉందన్నారు.