మల్లారెడ్డి మాటల్లో 'డెప్తు' కేటీఆర్ కు ఎంతలా కనిపించిందంటే?
ఒక పెళ్లికి వెళ్లిన మల్లారెడ్డి.. అక్కడ తనకు ఎదురైన బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్ కావటమే కాదు.. పార్టీని సైతం ఆత్మరక్షణలో పడేలా చేసింది.
By: Tupaki Desk | 28 April 2024 8:12 AM GMTచేతిలో తిరుగులేని అధికారాన్ని పదేళ్లుగా అనుభవిస్తున్న వేళ.. ఎదురుకాని ఎన్నో అంశాల్ని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటోంది. కీలకమైన సార్వత్రిక ఎన్నికల వేళ.. తమ పార్టీకి చెందిన మాజీ మంత్రి మల్లారెడ్డి మాటలు ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఆయన నోటి నుంచి వచ్చే మాటలకు.. సమాధానం చెప్పాల్సిన పరిస్థితి పార్టీ కీలక నేత కేటీఆర్ కు ఎదురవుతోంది.
సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు మీద కిందా మీదా పడుతున్న బీఆర్ఎస్ పార్టీకి దిమ్మ తిరిగేలా తాజాగా మల్లారెడ్డి మాటలు ఉండటం తెలిసిందే. ఒక పెళ్లికి వెళ్లిన మల్లారెడ్డి.. అక్కడ తనకు ఎదురైన బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్ కావటమే కాదు.. పార్టీని సైతం ఆత్మరక్షణలో పడేలా చేసింది. మల్లారెడ్డి వ్యాఖ్యలపై పలు మీడియా సంస్థలు కేటీఆర్ ను వివరణ కోరాయి. దీంతో.. ఆయన కొత్త లెక్కల్ని చెప్పుకొచ్చారు.
అయితే.. మల్లారెడ్డి మాటల్లోని లోతును కేటీఆర్ సరికొత్తగా ఆవిష్కరించారు. ఆయన మాటల అసలు అర్థాన్ని వివరించే ప్రయత్నం చేశారు. మల్కాజ్ గిరి ఎంపీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలవనున్నట్లుగా గులాబీ ఎమ్మెల్యే మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలన్నీ అనుభవంతో చేసినవిగా అభివర్ణించారు. 'మల్లారెడ్డి చాలా తెలివి కలిగిన వ్యక్తి. ఈటల రాజేందర్ ను మునగ చెట్టు ఎక్కించి కింద పడేయాలనేది ఆయన వ్యూహం' అంటూ కేటీఆర్ చేసిన కవరింగ్ ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. కేటీఆర్ కు ఎదురవుతున్న ఇబ్బంది అంతా ఇంతా కాదంటున్నారు.
మల్లారెడ్డి మాటల్లోని అంతరార్థం తెలియని చాలామంది ఆగమాగం అవుతున్నారిన.. ఆయన వ్యాఖ్యల్ని సీరియస్ గా తీసుకోవద్దన్న కేటీఆర్.. మల్కాజ్ గిరిలో కచ్ఛితంగా బీఆర్ఎస్ గెలుస్తుందన్న ధీమాను వ్యక్తం చేశారు. ఇదంతా చూస్తే.. ఎలాంటి కేటీఆర్ ఎలా మారారు? అన్న వ్యాఖ్య వినిపిస్తోంది. తన మాటలతో పార్టీకి మల్లారెడ్డి చేస్తున్న డ్యామేజ్ ను కంట్రోల్ చేయటానికి కేటీఆర్ కిందామీదా పడుతున్నారని చెబుతున్నారు. అదే సమయంలో ఆయన్ను పల్లెత్తు మాట అనలేని పరిస్థితి నెలకొందంటున్నారు.