Begin typing your search above and press return to search.

గులాబీ పార్టీకి మల్లారెడ్డి శకునిలా మారారా?

అంత పెద్ద గుమ్మడికాయ సైతం కత్తిపీటకు లోకువే అన్నట్లుగా.. కొందరు నేతలు ఆయా పార్టీ అధినేతలకు ఒక పట్టాన అంతుచిక్కని రీతిలో వ్యవహరిస్తుంటారు.

By:  Tupaki Desk   |   27 April 2024 11:30 AM GMT
గులాబీ పార్టీకి మల్లారెడ్డి శకునిలా మారారా?
X

అంత పెద్ద గుమ్మడికాయ సైతం కత్తిపీటకు లోకువే అన్నట్లుగా.. కొందరు నేతలు ఆయా పార్టీ అధినేతలకు ఒక పట్టాన అంతుచిక్కని రీతిలో వ్యవహరిస్తుంటారు. మిగిలిన నేతల్ని.. లక్షలాదిగాఉండే ఫాలోయర్స్ ను సైతం కంట్రోల్ చేసే సత్తా ఉన్న అధినేతలు సైతం.. కొందరు నేతల విషయంలో కాస్తంత తగ్గి ఉంటారు. అందుకు గులాబీ బాస్ కేసీఆర్ సైతం మినహాయింపు కాదంటారు. తన రాజకీయ ప్రత్యర్థులకు సైతం ఒక పట్టాన అంతుచిక్కని విధంగా ఉండే కేసీఆర్.. సొంత పార్టీకి చెందిన మాజీ మంత్రి.. మేడ్చల్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న మల్లారెడ్డి విషయంలో మాత్రం కిందా మీదా పడుతుంటారు.

ఆయన నోటి నుంచి వచ్చే వ్యాఖ్యల్ని చూస్తూ.. కామ్ గా ఉండటం అసాధ్యం. అలా అని ఆయన మీద వేటు వేసే ధైర్యం లేని పరిస్థితి. ఇలాంటి సిత్రమైన సీన్ ఒక్క మల్లారెడ్డికి మాత్రమే సాధ్యమని చెప్పాలి. తాజాగా ఒక పెళ్లి వేడుకలో ఎదురుపడ్డ ఈటల రాజేందర్ ను అప్యాయంగా పలుకరించిన మల్లారెడ్డి.. పనిలో పనిగా నువ్వే గెలుస్తున్నావ్ అన్నా.. అంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారటం తెలిసిందే.

కీలకమైన ఎన్నికల్లో.. గెలుపు కోసం కిందా మీదా పడుతూ.. ఈ ఎన్నికల్లో ఉనికి చాటకుంటే తీవ్ర పరిణామాలు ఎదురయ్యే ఇబ్బందిని గులాబీ పార్టీ ఎదుర్కొంటోంది. ఇలాంటి వేళ.. సొంత పార్టీ అభ్యర్థిని వదిలేసి.. ప్రత్యర్థి పార్టీకి చెందిన ఈటల రాజేందర్ ను ఉద్దేశించి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు తెర తీశాయని చెప్పాలి. మల్లారెడ్డి నోటి నుంచి ఎప్పుడు ఎలాంటి మాట వస్తుందో అర్థం కాని పరిస్థితి. ఆయన చేతలు సైతం సిత్రంగా ఉంటాయి.

ఆ మధ్యన కర్ణాటక రాజధాని బెంగళూరుకు వెళ్లిన మల్లారెడ్డి.. ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం ను కలవటం.. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకోవటం తెలిసిందే. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతల అభ్యంతరంతో ఆయన హస్తం గూటికి చేరే ప్రయత్నాలు మధ్యలో ఆగిపోయాయి. ఇలా.. తరచూ గులాబీ బాస్ కు.. గులాబీ పార్టీకి ధమ్కీలు ఇచ్చే సత్తా ఒక్క మల్లారెడ్డికి మాత్రమే సొంతమని చెబుతున్నారు.

ఇంతజరిగినా.. ఆయనపై చర్యలు తీసుకునేంత సీన్ గులాబీ బాస్ కు సైతం లేదంటున్నారు. గతంలో అయితే ఆయన ఒక్కరే ఉండేవారు. ఇప్పుడు ఆయనతో పాటు.. ఆయన సొంత అల్లుడు కూడా మల్కాజిగిరి ఎమ్మెల్యేగా ఉండటం తెలిసిందే. ఒకే కుటుంబంలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేల్ని వదులుకునేంత లగ్జరీ బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు లేదన్నది నిజం. అందుకే.. పంటి కింద రాయిలా ఉండే మల్లారెడ్డి మాటల్ని భరించుకుంటూ ఉండటమే తప్పించి.. మరింకేమీ చేయలేరన్న మాట గులాబీ తోటలో ఆసక్తికర చర్చగా మారింది. ఏమైనా.. మల్లారెడ్డి సుడే సుడిగా పలువురు అభివర్ణిస్తున్నారు. అందరికి ఏదోలా ధమ్కీలు ఇచ్చే కేసీఆర్ కే.. రివర్సులో ధమ్కీ ఇచ్చే ఒకే ఒక్కడు మల్లారెడ్డి అన్న మాటలు గులాబీ నేతల నోటి నుంచి అనధికారికంగా రావటం గమనార్హం.