బీఆరెస్స్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పక్క చూపులు చూస్తున్నారా?
తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ప్రారంభించింది
By: Tupaki Desk | 17 Dec 2023 11:30 AM GMTతెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ప్రారంభించింది. ఈ సందర్భంగా మొదలైన తొలి అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా మారాయి. ఈ సమయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు నెలలు ఉంటుందని ఒకరంటే.. అబ్బే, మూడు నెలలే అని మరొకరు చేస్తున్న కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోపక్క బీఆరెస్స్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారా అనే టాపిక్ తాజాగా తెరపైకి వచ్చింది.
అవును... తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో కూలిపోయే అవకాశాలున్నాయని బీఆరెస్స్ నేతల నుంచి కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో... అసలు వారికి ఉన్న మెజారిటీ మేజిక్ ఫిగర్ కంటే నాలుగు స్థానాలే అని మరొకరంటున్న సమయంలో... బీఆరెస్స్ నుంచి గెలిచిన మాజీ మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్ వైపు చూస్తున్నారా అనే చర్చ తెలంగాణ రాజకీయాల్లో మొదలైంది.
ఇటీవల మల్లారెడ్డిపై భూ కబ్జా కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే... అది కక్ష సాధింపు చర్య కాదని, చట్టం తనపని తాను చేసుకుపోతుందని అంటున్నారు. ఈ సమయంలో మల్కాజిగిరి నుంచి గెలిచిన తన అల్లుడు రాజశేఖర్ రెడ్డిని వెంటబెట్టుకుని కాంగ్రెస్ లోకి వెళ్లాలని మల్లారెడ్డి చూస్తున్నారా అంటూ తెలంగాణ రాజకీయాల్లో చర్చ మొదలైంది.
తనకున్న వ్యాపారాల దృష్ట్యా తనకు అధికార పార్టీ అండ ఉండాలని ఆయన భావిస్తున్నారని. ఈ విషయంలో బీఆరెస్స్, కాంగ్రెస్ అనే తారతమ్యాలు తనకు లేవని.. అధికార పార్టీ అండదండలే ముఖ్యమని మల్లారెడ్డి భావిస్తున్నారంటూ కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఇది వాస్తవం కాదని అంటున్నారు పరిశీలకులు.
అవును.. ఇది అసాధ్యం అనే మాటలు మల్లారెడ్డి పార్టీ మార్పు విషయంలో తదనుగుణంగా వినిపిస్తున్నాయి. బీఆరెస్స్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు మల్లారెడ్డి.. రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు, ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తొడగొట్టి మరీ రేవంత్ కు మల్లారెడ్డి సవాలు విసిరారు. ఎన్నికల సమయంలో వీరిద్దరిమధ్యా మాటల యుద్ధం బలంగా సాగింది. అది కూడా మల్లారెడ్డి కాంగ్రెస్ వైపు చూడరనే మాటకు బలం చేకూరుస్తుంది.
ఇదే సమయంలో అటు కేసీఆర్, ఇటు కేటీఆర్ తో ఉన్న అనుబంధం రీత్యా మల్లారెడ్డి అలాంటి పని చేయకపోవచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా... ప్రభుత్వం ఏర్పడి పట్టుమని 10 రోజులు కాకముందే బీఆరెస్స్ కీలక నేత మల్లారెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్లబోతున్నారనే ప్రచారం మాత్రం హాట్ టాపిక్ గా మారింది.