Begin typing your search above and press return to search.

బడ్జెట్ ప్రకారమే హామీలివ్వాలి.. సొంత ప్రభుత్వంపైనే ఖర్గే ఫైర్

ఆ పథకానికి బైబై చెప్పాలని నిర్ణయం తీసుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   1 Nov 2024 1:30 PM GMT
బడ్జెట్ ప్రకారమే హామీలివ్వాలి.. సొంత ప్రభుత్వంపైనే  ఖర్గే ఫైర్
X

గతేడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 135 సీట్లు సాధించి కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది. అయితే.. ఎన్నికల సందర్భంలో గెలుపొందేందుకు కాంగ్రెస్ పార్టీ అమలు సాధ్యం కాని హామీలను ఇచ్చింది. రాష్ట్ర ప్రజల కోసం ఐదు కీలక పథకాలను ప్రకటించింది. వీటిని విశ్వసించిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు.

కర్ణాటకలో ఎన్నికల వేళ ఇచ్చిన ఆ ఐదు హామీలు కూడా చాలా ఖర్చుతో కూడుకున్నవే. అందుకే అధికారంలోకి వచ్చాక కూడా వాటిని అమలు చేయాలంటే కత్తిమీద సాములా మారింది. దాంతో ఆ ఐదు గ్యారంటీల నుంచి శక్తి పథకాన్ని క్లోజ్ చేయాలని అక్కడి ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఆ పథకానికి బైబై చెప్పాలని నిర్ణయం తీసుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వ్యాఖ్యలు చేశారు. ఈ పథకంపై మరోసారి సమీక్షించే ఆలోచన కూడా ప్రస్తుతానికి లేదని స్పష్టం చేశారు.

అక్కడి ప్రభుత్వం ఒక్కసారిగా యూటర్న్ తీసుకోవడంతో ఈ వివాదంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్పందించారు. సొంత ప్రభుత్వంపైనే ఆయన విరుచుకుపడ్డారు. బడ్జెట్ ఆధారంగా హామీలు ప్రకటించాలని, ఇష్టారాజ్యంగా హామీలు ఇస్తే రాష్ట్రం దివాలా తీస్తుందని హెచ్చరించారు. కీలకమైన హామీలను రద్దు చేయబోమని స్పష్టం చేశారు.

అందుకే.. మహారాష్ట్ర ఎన్నికల్లోనూ ఆరు, ఏడు అంటూ ఎలాంటి హామీలూ ఇంకా ప్రకటించ లేదని చెప్పారు. మహారాష్ట్రలో ఆర్థిక ప్రాతిపదికన హామీ ఇవ్వాలని కోరినట్లు ఖర్గే తెలిపారు. మహారాష్ట్రలో హామీలు వాస్తవికంగా ఉండేలా.. రాహుల్ గాంధీ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ఖర్గే వెల్లడించారు. 15రోజుల క్రితమే నివేదిక అందిందని, నాగ్‌పూర్, లేదా ముంబైలో ప్రకటిస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం హామీలు విస్మరిస్తే తర్వాతి తరానికి అపఖ్యాతి వస్తుందని తెలిపారు.

అంతేకాకుండా డీకేను ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మీరు కర్ణాటకలో 5 గ్యారంటీలు అమలు చేస్తున్నారని, ఇదే అంశాన్ని మహారాష్ట్రలో ప్రచారం చేస్తున్నామని’ చెప్పారు. ఇప్పుడేమో కర్ణాటకలో ఇచ్చిన ఐదు గ్యారంటీల్లో నుంచి ఒక గ్యారంటీని రద్దు చేయడం గురించి మాట్లాడుతున్నారని వ్యంగ్యంగా అన్నారు. దీంతో అక్కడే ఉన్న సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ నవ్వుకున్నారు.

ఎన్నికల సమయంలో ప్రజలు ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ హామీలను ఇస్తోంది. కర్ణాటకలో ఐదు గ్యారంటీలు, తెలంగాణలో ఆరు గ్యారంటీలు ఇచ్చారు. అయితే.. ఇప్పుడు ఆ ఉచిత పథకాలను అమలు చేయలేక ఆ రెండు రాష్ట్రాల్లో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆపసోపాలు పడుతున్నాయి. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన తరువాత నెల రోజులకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించారు. కానీ.. దానిని ఏడాదిన్నరకే మంగళం పాడేందుకు రెడీ అవుతున్నారు. ఇటు తెలంగాణలోనూ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో అన్ని పూర్తిస్థాయిలో అమలు కావడంలేదు. దీనిపై నిత్యం ప్రతిపక్షాలు ప్రశ్నిస్తూనే ఉన్నాయి. అందుకే.. మహారాష్ట్ర ఎన్నికల్లో హామీలపై ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.