ఇండియా కూటమి ప్రధానిగా ఖర్గే...!?
మల్లికార్జున ఖర్గే ఏ ముహూర్తాన కాంగ్రెస్ జాతీయ ప్రెసిడెంట్ అయ్యారో కానీ ఆయన దశ చాలా బాగుంది
By: Tupaki Desk | 19 Dec 2023 5:15 PM GMTమల్లికార్జున ఖర్గే ఏ ముహూర్తాన కాంగ్రెస్ జాతీయ ప్రెసిడెంట్ అయ్యారో కానీ ఆయన దశ చాలా బాగుంది. ముందు తన సొంత స్టేట్ కర్నాటకలో కాంగ్రెస్ ని అధికారంలోకి తెచ్చారు. ఆ పక్కనే ఉన్న తెలంగాణాలో కూడా కాంగ్రెస్ ని అధికారంలోకి తెచ్చారు. ఉత్తరాదిన కాంగ్రెస్ కొన్ని రాష్ట్రాలలో ఓడింది. అయితే ఖర్గే వరకూ చూస్తే ఆయన పూర్తిగా సౌతిండియాకు చెందిన వారు.
దాంతో ఇపుడు ఆయన పార్టీ ప్రెసిడెంట్ గా తమ పరపతిని పలుకుబడిని నిరూపించుకున్నారు. ఇక కాంగ్రెస్ దశ కొంత తిరిగింది అనడానికి కూడా ఖర్గే కారణంగా ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ గెలిచింది.
ఇక ఇండియా కూటమికి కాంగ్రెస్ తరఫున ఆయనే కీలకంగా ఉంటున్నారు. దీంతో ఇపుడు ఇండియా కూటమిలో విపక్షాలు అన్నీ కూడా ఖర్గే వైపు చూస్తున్నాయని అంటున్నారు. మంగళవారం ఢిల్లీలోని అశోకా హొటెల్ లో జరిగిన ఇండియా కూటమి సమావేశంలో వర్తమాన రాజకీయ పరిణామాలతో పాటు భవిష్యత్తులో తీసుకోవాల్సిన అంశాల మీద చర్చించారు అని తెలుస్తోంది.
ఇక ఈ సమావేశంలో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. ఖర్గేను ఇండియా కూటమి ప్రధాని అభ్యర్ధిగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో పాటు పలువురు సీనియర్ నేతలు సూచించినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని ఖర్గే సున్నితంగా తిరస్కరించినట్లుగా చెబుతున్నారు.
ముందు అంతా కలసి సమిష్టిగా పోరాడుదామని ఆ తరువాతనే ప్రధాని అభ్యర్ధిని నిర్ణయిద్దామని ఖర్గే చెప్పినట్లుగా తెలుసోంది. అనంతరం ఖర్గే మీడియాతో మాట్లాడుతూ ఇండియా కూటమి సమావేశానికి 28 పార్టీలు హాజరయ్యాయని వచ్చే ఎన్నికల్లో ఎలా ముందుకు సాగాలన్నది చర్చించాయని చెప్పారు. రానున్న రోజులలో ఇండియా కూటమి తరఫున దేశవ్యాప్తంగా ఎనిమిది నుంచి పది సమావేశాలను నిర్వహిస్తామని ఖర్గే తెలిపారు.
ఇదిలా ఉంటే జనవరి రెండవ వారంలోగా సీట్ల పంపకం మీద ఒక నిర్ణయం తీసుకుని ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేయాలి అన్న దాని మీద ఖరారు చేసుకోవాలని ఇండియా కూటమి నిర్ణయించినట్లుగా ఖర్గే చెప్పారు. ఇక ఎటువంటి సమస్య లేకుండా సీట్ల సర్దుబాటు చేసుకోవాలని ఇండియా కూటమి నేతలు నిర్ణయించడం కూడా విశేష పరిణామం.
మరో వైపు చూస్తే ఎన్నికల అనంతరమే ప్రధాని అభ్యర్ధి ఎవరో ఇండియా కూటమి నిర్ణయిస్తుంది అని ఖర్గే చెప్పడం గమనార్హం. మొత్తం మీద విపక్షాలు అన్నీ కూడా ఖర్గే అభ్యర్ధిత్వం పట్ల మొగ్గు చూపడం విశేషం. సీనియర్ మోస్ట్ నేత. దళిత సామాజిక వర్గం నేపధ్యం అన్నీ కలసి కూడా ఆయన అవకాశాలు పెంచుతున్నాయని అంటున్నారు. చూడాలి మరి ఇండియా కూటమి గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయో.