మమతా దీదీ మీదకు పవనాస్త్రం ?
మమతా బెనర్జీ పట్ల జనాదరణ బాగా తగ్గిందని పదిహేనేళ్ళ పాలన తరువాత ఎటూ యాంటీ ఇంకెంబెన్సీ ఉంటుందని బీజేపీ వ్యూహకర్తలు అంచనా వేస్తున్నారు.
By: Tupaki Desk | 21 Feb 2025 4:15 PM GMTపశ్చ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి అయిన మమతా బెనర్జీ ని మాజీ సీఎం చేయాలన్నది బీజేపీ పట్టుదల. ఆమె వరసగా మూడుసార్లు పశ్చిమ బెంగాల్ నుంచి సీఎం అయ్యారు. 2011లో తొలిసారి ముఖ్యమంత్రి అయిన ఆమె ఆ తర్వాత 2016లో రెండోసారి గెలిచారు. 2021లో మరోసారి విజయఢంకా మోగించారు.
అయితే నాలుగవ సారి కూడా తానే సీఎం అని ఆమె ధీమాగా ఉన్నారు. కానీ ఈసారి బెంగాల్ గద్దె మీద బీజేపీ జెండా ఎగిరి తీరుతుందని కాషాయదళం గట్టి విశ్వాసంతో ఉంది. మమతా బెనర్జీ పట్ల జనాదరణ బాగా తగ్గిందని పదిహేనేళ్ళ పాలన తరువాత ఎటూ యాంటీ ఇంకెంబెన్సీ ఉంటుందని బీజేపీ వ్యూహకర్తలు అంచనా వేస్తున్నారు.
మరో వైపు చూస్తే బీజేపీకి ఎన్డీయే మిత్రులు అన్ని విధాలుగా ఎన్నికల వేళ అంది వస్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూసుకునిపోయారు. ఫలితంగా గతంలో ఎన్నడూ గెలవని సీట్లలో బీజేపీ విజయ దుందుభి మోగించింది దాంత్గో పవన్ క్రేజ్ కి బీజేపీ పెద్దలు తెగ మోజు పెంచుకున్నారు.
ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు తెలుగు వారు ఎక్కువగా నివసించే ప్రాంతాలలో ప్రచారం చేసి పెట్టారు. బాబు సభలకు జనాలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అంతే కాదు చంద్రబాబు ప్రచారం చేసిన చోటల్లా బీజేపీ అభ్యర్ధులు భారీ మెజారిటీలతో నెగ్గారు ఆ విధంగా బాబుకు ఎన్డీయేలో మరింత ప్రాధాన్యత పెరిగింది.
ఇపుడు చూస్తే పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఉన్నాయి. 2026 మేలో జరిగే ఈ ఎన్నికలు బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని బీజేపీ పట్టు మీద ఉంది. దానితో జనసేన అధినేత పవన్ ని బెంగాల్ ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున ఉపయోగించుకుంటారు అన్న చర్చ నడుస్తోంది.
దానికి కారణం ఏంటి అంటే తాజాగా పవన్ కళ్యాణ్ మహా కుంభ మేళాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మమతా బెనర్జీ మీద పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహా కుంభ మేళాను మృత్యు కుంభ్ గా ఆమె పేర్కొనడం పట్ల పవన్ తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు.
ఒక మతం మీదనే ఇలా విమర్శలు చేయగలుగుతారంటూ ఆయన చేసిన కామెంట్స్ దీదీ శిబిరంలో కొత్త చర్చను రేపాయి. దీంతో పవన్ నేరుగా మమతాను టార్గెట్ చేసినట్లు అయింది. ఈ కొత్త రాజకీయ పరిణాంతో పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పవన్ ఎన్నికల ప్రచారం చేస్తారని ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి.
బీజేపీకి మద్దతుగా పవన్ ఇప్పటికే ప్రచారం చేసి ఉన్నారు. కాబట్టి బెంగాల్ విషయంలో కూడా ఆయన సిద్ధంగా ఉంటారని అంటున్నారు. ఇక వెండి తెర పవర్ స్టార్ గా అదే విధంగా ఇటీవల కాలంలో హిందూత్వ నినాదాన్ని బలంగా వినిపిస్తున్న నాయకుడిగా పవన్ ఇమేజ్ జాతీయ స్థాయిలో గట్టిగానే ఉంది. దాంతో పాటు బెంగాల్ లోనూ పవన్ పట్ల క్రేజ్ ఉంది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని బీజేపీ మమత మీద పవనాస్త్రాన్ని ఉపయోగిస్తుందని అంటున్నారు. అదే కనుక జరిగితే మాతం బెంగాల్ ఎన్నికల ప్రచారం హోరెత్తడం ఖాయమని అంటున్నారు.