బెడిసి కొట్టిన మమత వ్యూహం.. బెంగాల్‌లో మారణహోమం!
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత.. తన బాధను ప్రపంచ బాధగా చూపిస్తారనే పేరుంది.
By: Tupaki Desk | 20 Aug 2024 12:30 PM GMTపశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత.. తన బాధను ప్రపంచ బాధగా చూపిస్తారనే పేరుంది. రాష్ట్రంలో ఏ చిన్న ఘటన జరిగినా.. ఆమె దానిని తన ప్రధాన ప్రత్యర్థి బీజేపీకి ముడి పెట్టి.. రాజకీయం చేస్తారన్న విమర్శలు కూడా ఉన్నాయి. సందేశ్ ఖాలీ ఘటన నుంచి వరదల వరకు.. అన్ని విషయాలను కూడా ఆమె బీజేపీకి ముడిపెట్టారు. బీజేపీ వల్లే రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చా రు. ఆమెపాలనకు ఆమే మంచి మార్కులు కూడా వేసుకున్నారు. ఇది కొన్నాళ్లుగా జరుగుతున్నదే.
అయితే.. ఇప్పుడు కోల్‌కతాలోని ఆర్ జీ కర్ ఆసుపత్రిలో 31 ఏళ్ల జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యా చార ఘటనను కూడా.. సీఎం మమతా బెనర్జీ ప్రతిపక్ష బీజేపీపై నెట్టేసేందుకు వ్యూహాత్మక ప్రయత్నాలు చేస్తున్నారన్న విమర్శలు జోరుగా సాగుతున్నాయి. రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన వెనుక బీజేపీ ఉందని నేరుగా ఆమె అనకపోయినా.. ఆమె చేస్తున్న పనులు గమనిస్తున్న వారు సొంత పార్టీ నాయకులు కూడా.. నేరుగానే బయట పడుతున్నారు.
కోల్‌కతా ఘటనకు నిరసనగా వైద్య విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు మమత మద్దతివ్వడం.. వారితో కలిసి కోల్‌కతా వీధుల్లోకిలో మీటర్ల దూరం ర్యాలీలో నడవడం, కొవ్వొత్తులు వెలిగించి.. నిరసన తెలపడం వంటివి సొంత పార్టీలోనే వివాదంగా మారాయి. ప్రస్తుతం ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా మమతే వ్యవహరిస్తున్నారు. అలాంటప్పుడు ఆమె ఈ మొత్తం వివాదానికి.. దారుణానికి బాధ్యత వహించాలి. సరైన చర్యలు తీసుకునేందుకు, పోలీసులను సరైన విధంగా విచారణకు ఆదేశించేందుకు ఆమె చర్యలు తీసుకోవాలి.
కానీ, మమత మాత్రంఈ విషయాన్ని పక్కన పెట్టి.. కేసును సీబీఐకి అప్పగించారు కాబట్టి(రాష్ట్ర హైకోర్టు అప్పగించింది) ఇక, తన చేతిలో ఏమీ లేదని ఆమె చెబుతున్నారు. చిత్రంగా ఆమె.. ఓ డిమాండ్ కూడా చేస్తున్నారు. వైద్యురాలిపై జరిగిన పాశవిక ఘటనలో దోషికి మరణ శిక్ష విధించాలని కోరుతున్నారు. అయితే.. అసలు ఈ కేసును రాష్ట్ర పరిధి నుంచి సీబీఐకి అప్పగించడానికి మమతే కారణమన్నది అధికార పార్టీ టీఎంసీ నేతలు చెబుతున్న మాట, విమర్శ కూడా. మొత్తంగా చూస్తే.. మమత ఎత్తుగడ తాజా దారుణంలో బూమరాంగ్ అయింది. చేతులు కాల్చుకునే వరకు తెచ్చుకుంది అనడంలో సందేహం లేదు.