Begin typing your search above and press return to search.

హ‌త్యాచారం సెగ‌: మ‌మ‌త టెంపర్ కు తాళం.. ఏం చేశారంటే!

క‌ల‌సికాపురం చేస్తూనే.. కాంగ్రెస్‌తో క‌య్యానికి దిగినా.. మోడీని వ్య‌తిరేకిస్తూనే.. ఆయ‌న‌కు బెంగాలీ గులాబ్ జామ్‌లు పంపించినా.. మ‌మ‌త స్ట‌యిలే వేరు

By:  Tupaki Desk   |   23 Aug 2024 11:30 AM GMT
హ‌త్యాచారం సెగ‌:  మ‌మ‌త టెంపర్ కు తాళం.. ఏం చేశారంటే!
X

ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ అంటే.. దేశంలో ఉన్న ముఖ్య‌మంత్రుల్లోనే కాదు.. రాజ‌కీయ నాయ‌కుల్లోనూ ఆమెను మించిన ఫైర్ బ్రాండ్ ఎవ‌రూ లేర‌నే పేరు తెచ్చుకున్నారు. మిత్ర‌ప‌క్షాల నుంచి త‌న‌కు ప్ర‌త్య‌ర్థులుగా ఉన్న విప‌క్షాల వ‌ర‌కు కూడా.. ఎలాంటి రాజ‌కీయాలు చేస్తే.. ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉంటుందో అంచ‌నా వేసుకుని.. ఏ ఎండ‌కు ఆ గొడుగు ప‌ట్టే నాయ‌కురాలిగా పేరు తెచ్చుకున్నారు. క‌ల‌సికాపురం చేస్తూనే.. కాంగ్రెస్‌తో క‌య్యానికి దిగినా.. మోడీని వ్య‌తిరేకిస్తూనే.. ఆయ‌న‌కు బెంగాలీ గులాబ్ జామ్‌లు పంపించినా.. మ‌మ‌త స్ట‌యిలే వేరు!!

మ‌రో ఏడాదిలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో మ‌మ‌త ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి గుర‌వుతున్నారు. ఈ క్ర‌మంలో త‌న అధికారం కాపాడుకునేందుకు చాలా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. ఎవ‌రినీ ఎద‌గ‌కుండా చేస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నా.. త‌న‌ను ఒంట‌రిని చేసి.. ఆడుకుంటున్నార‌ని ఎదురు దాడి కూడా చేస్తున్నారు. ఇలాంటి కీల‌క స‌మ‌యంలో అనూహ్యంగా కోల్‌క‌తా ఆసుప‌త్రిలో జ‌రిగిన హ‌త్యాచారం వ్య‌వ‌హారం.. సీఎం మ‌మ‌త మెడ‌కు చుట్టుకుంది.

ఒక్క ప్ర‌తిప‌క్షాల నుంచే కాకుండా.. సొంత పార్టీలోనూ అగ్గిరాజేసిన ఈ హ‌త్యాచారం నుంచి త‌న‌ను తాను కాపాడుకోవ‌డంలో మ‌మ‌త స‌ర్వ‌శ‌క్తులూ ఒడ్డుతున్నారు. అయినా.. చేతులు కాలిపోతున్నాయి. దీంతో ఇక‌, లాభం లేద‌ని అనుకున్నారో.. లేక వ్యూహంప‌న్నారో మొత్తానికి త‌న టెంప‌ర్‌కు తాళం వేసుకున్నారు. వంద మెట్లు దిగివ‌చ్చాయి. నిత్యం విమ‌ర్శ‌లు గుప్పించే ప్ర‌ధాని మోడీతో స‌ర్దుకు పోయేందుకు స‌మాయత్తం అయ్యారు. తాజాగా ``రండి క‌లిసి ప‌నిచేద్దాం`` అంటూ సుదీర్ఘ లేఖ రాశారు.

``రాష్ట్రంలో జ‌రిగిన ఘ‌ట‌న దారుణం. అయితే.. ఇది మా రాష్ట్రానికే ప‌రిమితం కాలేదు. మీరు(మోడీ) గ‌మ‌నించాలి. దేశంలో ఎక్క‌డో ఒక చోట రోజూ 90కిపైగా అత్యాచారాలు జ‌రుగుతున్నాయి. వీటిని `మ‌నం` అంద‌రం క‌లిసి క‌ట్ట‌డి చేయాల్సి ఉంది. 15 రోజుల్లో దోషుల‌ను గుర్తించి.. క‌ఠినంగా శిక్షించాల్సి కూడా ఉంది. ఈ క్ర‌మంలో చ‌ట్టం చేసేందుకు మేం మీకు పూర్తిగా స‌హ‌క‌రిస్తాం`` అంటూ.. మ‌రిన్ని విష‌యాలు జోడించి.. మ‌మ‌త లేఖ సంధించారు.

నిజానికి మ‌మ‌త.,... నిత్యం నిప్పులు చెరిగే మోడీకి ఇలా లేఖ రాస్తార‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. కానీ, ప్ర‌స్తుతం బెంగాల్‌లో త‌న ప్ర‌భుత్వం ప‌రిస్థితి చేతులు దాటిపోయిన నేప‌థ్యంలో ఆమె.. దిగిరాక త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ ప‌రిస్తితిని గ‌మ‌నిస్తే.. ఆమె మ‌రింత దూకుడుగా ముందుకు వెళ్లి.. కేంద్రంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నా ఆశ్చ‌ర్యం లేద‌న్న సంకేతాలు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం జాతీయ రాజ‌కీయాల్లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది.