మోడీకి నచ్చింది వండిపెడతా... మమతా బెనర్జీ బంపరాఫర్!
ఆ సంగతి అలా ఉంటే... తాజాగా ప్రధాని మోడీకి ఏది కావాలంటే అది వండిపెడతా అంటూ బపరాఫర్ ప్రకటించారు మమతా.
By: Tupaki Desk | 15 May 2024 6:49 AM GMTదేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల సందడి కొనసాగుతున్న వేళ నేతల విమర్శలు సెటైర్లు పీక్స్ కి చేరుతున్నాయి. ఈ క్రమంలో కొంతమంది నేతలు మరీ దిగజారిపోయి ప్రజలకు పనికిరాని విషయాలపై విమర్శలు గుప్పిస్తుంటే.. మరికొంతమంది అలాంటి నేతలకు చురకలంటిస్తూ సెటైర్లు పేలుస్తున్నారు. ఆ సంగతి అలా ఉంటే... తాజాగా ప్రధాని మోడీకి ఏది కావాలంటే అది వండిపెడతా అంటూ బపరాఫర్ ప్రకటించారు మమతా. ఎందుకు.. ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం!
నవమి నవరాత్రుల సమయంలో బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ చేపలు తింటోన్నారంటూ ఒక వీడియోపై ఇటీవల రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే. తినే తిండి, వేసుకునే దుస్తులు కూడా ఇప్పుడు రాజకీయాల్లో భాగమైపోతున్నాయనే సంగతి కాసెపు పక్కనపెడితే... ఈ విషయంలో ఏకంగా దేశ ప్రధాని మోడీ సైతం విమర్శలు గుప్పించారు.
ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా తాను వంట చాలా బాగా చేస్తానని, ప్రధాని కోసం ఏదైనా వండేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆఫర్ ఇచ్చారు. తాను చేపల కూర కూడా బాగా వండుతానని ఆమె వెల్లడించారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు మళ్లీ ఎంటరయ్యారు.
అవును... కోల్ కతాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన బెంగాల్ సీఎం మమతా... "నేను చిన్నతనం నుంచి వంట చేస్తున్నా.. చాలా రుచిగా వండుతానని నా చేతివంట తిన్నవాళ్లు అంటారు. ప్రధాని మోడీ కోసం ఏదైనా వండేందుకు సిద్ధంగా ఉన్నా. ఆయనకు ఏది ఇష్టమైతే అదే వండిపెడతా. ఢోక్లా లాంటి శాకాహారంతో పాటు చేపల కూర లాంటి మాంసాహార వంటకాలు కూడా బాగా వచ్చు" అని వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో... హిందువుల్లోనూ వివిధ వర్గాలు ఉన్నాయని, వారు వారు ప్రత్యేకమైన ఆచారాలు, భిన్నమైన ఆహారపు అలవాట్లు కలిగి ఉంటారని.. అందులో కొంతమంది పండగల వేళ మాంసాహారం వండుకుని తింటారని తెలిపారు. ఇదే సమయంలో... అసలు ఒకరి ఆహార అలవాట్లపై ఆంక్షలు విధించే అధికారం బీజేపీకి ఎక్కడ ఉంది? ఈ దేశశ భిన్నత్వంపై బీజేపీ అధినాయకత్వానికి పెద్దగా అవగాహన లేనట్లు కన్పిస్తోంది అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
దీంతో... ఈ వ్యాఖ్యలు తీవ్ర వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు మైకుల ముందుకు వచ్చేశారు. ఇందులో భాగంగా... శాకాహారి అయిన ప్రధానికి నాన్ వెజ్ వండిపెడతానని అంటున్నారంటూ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రధానిని అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.