Begin typing your search above and press return to search.

స్పీకర్ ఎన్నికలో ఇండియా కూటమికి దీదీ షాక్?

లోక్ సభ స్పీకర్ ఎంపిక వ్యవహారం ఇపుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోన్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   25 Jun 2024 4:19 PM GMT
స్పీకర్ ఎన్నికలో ఇండియా కూటమికి దీదీ షాక్?
X

లోక్ సభ స్పీకర్ ఎంపిక వ్యవహారం ఇపుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఎన్డీయే తరఫున గత సభల్లో స్పీకర్ గా పనిచేసిన ఓం బిర్లా నామినేషన్ దాఖలు చేశారు. సంప్రదాయం ప్రకారం డిప్యూటీ స్పీకర్ పదవి తమకు ఇవ్వాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కోరారు. కానీ, అందుకే ఎన్డీఏ నేతలు ఒప్పుకోకపోవడంతో సంచలన రీతిలో స్పీకర్ పదవికి ఎన్నిక జరగబోతోంది. ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ ఎంపీ కె సురేశ్ స్పీకర్ పదవి కోసం నామినేషన్ వేశారు. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో లోక్ సభ స్పీకర్ పదవి కోసం చరిత్రలో తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలోనే ఇండియా కూటమికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ షాకివ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఆ ఎన్నికలో ఇండియా కూటమికి తాము మద్దతు ఇవ్వకూడదని దీదీ ఫిక్స్ అయ్యారట. సురేశ్ ను నామినేట్ చేస్తున్నామన్న సంగతి తమకు చెప్పలేదని దీదీ గుర్రుగా ఉన్నార. అందుకే, తమ మద్దతు సురేశ్ కు ఇవ్వకూడదని టీఎంసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, స్పీకర్ ఎన్నికలో సురేశ్ నామినేషన్ గురించి తనకు చెప్పారని టీఎంసీ ఎంపీ డెరెక్ చెప్పారు. కానీ, తమ పార్టీ అధినేత్రి మమతతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

మరోవైపు, ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ మండిపడ్డారు. స్పీకర్ ఎన్నికల్లో అధికార పక్షానికి సహకరించేందుకు తాము సిద్ధమేనని, సంప్రదాయం ప్రకారం డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు ఇవ్వాలని తాను కోరానని అన్నారు. ఈ విషయంపై తమ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను రాజ్ నాథ్ సింగ్ ఫోన్ లో సంప్రదించారని, కానీ, ఇప్పటివరకు స్పందన రాలేదని అన్నారు. కాబట్టే, సంప్రదాయాన్ని వీడి ఇండియా కూటమి తరఫున స్పీకర్ బరిలో ఎంపీ సురేశ్ ను నిలబెట్టక తప్పలేదన్నారు.