Begin typing your search above and press return to search.

మోడీకి దీదీ దెబ్బ‌.. బెంగాల్‌లో మోడీ ఎత్తు పార‌లేదు!

రాజ‌కీయాల్లో వ్యూహ ప్ర‌తివ్యూహాలు కామ‌నే. అధికార పార్టీని దెబ్బ‌కొట్టేందుకు ప్ర‌త్య‌ర్థులు త‌మ‌కు ఉన్న అన్ని అవ‌కాశాల‌ను వినియోగించుకుంటారు

By:  Tupaki Desk   |   4 Jun 2024 2:14 PM GMT
మోడీకి దీదీ దెబ్బ‌.. బెంగాల్‌లో  మోడీ ఎత్తు పార‌లేదు!
X

రాజ‌కీయాల్లో వ్యూహ ప్ర‌తివ్యూహాలు కామ‌నే. అధికార పార్టీని దెబ్బ‌కొట్టేందుకు ప్ర‌త్య‌ర్థులు త‌మ‌కు ఉన్న అన్ని అవ‌కాశాల‌ను వినియోగించుకుంటారు. ఈ క్ర‌మంలో ఎంత చేయాలో అంతా చేస్తారు.అయితే.. ప్ర‌త్య‌ర్థుల వ్యూహాల‌ను ప‌సిగ‌ట్టి ఎప్ప‌టిక‌ప్పుడు వాటిని ఛేదించుకుంటూ.. ముందుకు సాగాల్సిన అవ‌స‌రం అధికార పార్టీల ల‌క్ష్యం కావాలి. ఈ విష‌యంలో ప‌శ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ సంపూర్ణంగా విజ‌యం ద‌క్కించుకున్నారు. రాష్ట్రంలోని 42 పార్ల‌మెంటు స్థానాల్లో క‌నీసం 40 ద‌క్కించుకునేందుకు బీజేపీ ఎత్తుగ‌డ వేసింది.

ముఖ్యంగా బీజేపీ పాల‌న‌పై నిప్పులు చెరిగే మ‌మ‌తా బెన‌ర్జీకి ఎక్క‌డొ ఒక చోట భారీ షాక్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్న బీజేపీ నేత‌లు, ముఖ్యంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా వంటివారు క‌త్తిక‌ట్టిన‌ట్టు వ్య‌వ‌హ‌రించారు. మ‌ణిపూర్ లో నెల‌ల త‌ర‌బ‌డి విధ్వంసం జ‌రిగినా ప‌ట్టించుకోని వారు.. ఇక్క‌డి సందేశ్‌ఖాళీలో జ‌రిగిన ఘ‌ట‌న పై పెద్ద ఎత్తున రాజ‌కీయం చేశారు. సీబీఐ పంపించారు. అలానే టీచ‌ర్ పోస్టుల భ‌ర్తీ విష‌యంలో జ‌రిగిన కుంభ‌కోణాన్ని కూడా.. పెద్ద ఎత్తున రాజ‌కీయంగా వాడుకున్నారు. మొత్తంగా వారి టార్గెట్ అయితే.. 30 - 40 సీట్లు.

అయితే.. బీజేపీ వ్యూహాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు క‌నిపెట్ట‌డంతోపాటు వాటిని బ‌లంగా ఎదుర్కొనేందుకు మ‌మ‌త ప్ర‌య‌త్నించారు. బీజేపీ మ‌త రాజ‌కీయాల‌ను ప్ర‌ధానంగా ఆమె త‌న ప్ర‌చారంలో అస్త్రంగా చేసుకున్నారు. అంతేకాదు.. మోడీ ధ‌నికుల‌ను మ‌రింత ధ‌నికులుగా చేశార‌ని.. రాష్ట్రంలో గ‌వ‌ర్న‌ర్ పాల‌న ద్వారా.. ప్ర‌జాప్ర‌భుత్వాన్ని కూల్చే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని కూడా.. ప్ర‌జ‌ల్లోకి వెళ్లారు. మొత్తానికి ఐప్యాక్ క‌నుస‌న్న‌ల్లో మ‌మ‌త దూకుడు జోరుగాసాగింది. ప‌లితంగా ఎగ్జిట్ పోల్స్ స‌ర్వేల‌ను తోసి పుచ్చి మ‌రీ.. ఇప్పుడు మ‌మ‌త పార్టీ తృణ‌మూల్ పార్ల‌మెంటు స్థానాల్లో దూకుడుగా ముందుకు సాగుతోంది. ప్ర‌స్తుతం క‌ట‌ప‌టి వార్త‌లు అందేస‌రికి 30 - 34 స్థానాల్లో మ‌మ‌త పార్టీ పుంజుకుంది. ఆధిక్యంలో కొన‌సాగుతోంది.

ఇక‌, ఎగ్జిట్ పోల్స్ మాత్రం గ‌త శ‌నివారం.. ఇక్క‌డ మ‌మ‌త పార్టీకి వ్య‌తిరేకంగా స‌ర్వేలు ఇచ్చాయి. ఒక్క‌మ మ‌మ‌తే కాదు.. కాంగ్రెస్ కూట‌మికి కూడా.. జాతీయ మీడియా స‌ర్వేలు.. అన‌నుకూలంగానే ఫ‌లితాలు ప్ర‌క‌టించాయి. అయితే.. వాటిని ఛేదించుకుని మ‌రీ మ‌మ‌త ముందుకు సాగుతున్నారు. కాగా.. రేపు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియాకూట‌మి అధికారంలోకి వ‌చ్చే ప‌రిస్థితి ఉంటే.. మ‌మ‌త మ‌ద్ద‌తు అత్యంత కీల‌కం కానుండ‌డం గ‌మ‌నార్హం.