Begin typing your search above and press return to search.

ఇండియా కూటమికి మమత గండం !?

ఇండియా కూటమి సమావేశంపై టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ బెంగాల్ లో తొమ్మిది లోక్ సభ స్థానాల్లో అదేరోజు ఎన్నికలు ఉన్నందున తాను ఢిల్లీ సమావేశం కోసం రాలేనని చెప్పానని వెల్లడించారు.

By:  Tupaki Desk   |   27 May 2024 5:29 PM GMT
ఇండియా కూటమికి మమత గండం !?
X

మమతా బెనర్జీ ఉండాల్సిన వారు అని అందుకే అంటారు. ఆమె ఉండే పక్షంలో విపక్షంగా ఉంటారు. అలాగని తాను దూరంగానూ ఉండరు దగ్గరగానూ ఉండరు. జాతీయ స్థాయిలో మోడీ అమిత్ షాలను ఢీ కొట్టి ఇండియా కూటమి ఈసారి బాగానే రాజకీయ ప్రదర్శన చేసింది అన్న విశ్లేషణలు ఉన్నాయి.

రాహుల్ గాంధీ లాంటి వారు ఆరితేరిపోయిన తీరులో స్పీచ్ లను ఇచ్చారు. మల్లికార్జున ఖర్గే లాంటి వారి ఇంటర్వ్యూలు భలే ఆకట్టుకుంటున్నాయి. ములాయం సింగ్ రాజకీయ చతురతను పూనిన తీరులో అఖిలేష్ యాదవ్ గొప్పగా ఎన్నికల ప్రచారంలో దూకుడు చేశారు. కేజ్రీవాల్ క్రేజ్ చెప్పతరమా అన్నట్లుగా ఆయన స్పీడ్ ఒక రేంజిలో సాగింది.

ఇలా ఇండియా కూటమిలో అందరు ఆటగాళ్ళూ తమ నూరు శాతం ప్రతిభను చూపించారు. మాటకు మాట అన్నట్లుగా మోడీ అమిత్ షాలకు పంచుల మీద పంచులు ఇచ్చారు. ఈసారి మోడీ అధికారంలోకి రారు ఇది నా గ్యారంటీ అంటూ రాహుల్ వేసిన సెటైర్ అదిరిపోలే అని అంటున్న వారూ ఉన్నారు.

మోడీ భాషలో తేడా చూస్తే గెలుపు ఎవరితో చెప్పొచ్చు అని అఖిలేష్ పేల్చిన డైలాగ్ కూడా బెదరగొట్టేదే. ఇలా చూస్తూ పోతే ఎన్డీయే మీద నామమాత్రం పోటీ స్థాయి నుంచి గెలుపు మాదే అన్న దిశగా ఇండియా కూటమి కధను ఒడ్డుకు చేర్చారు ఎందరో మహానుభావులు.

ఇక జనవరి 1వ తేదీతో ఏడవ విడత చివరి విడత లోక్ సభ ఎన్నికలు పూర్తి అవుతాయి. దాంతో సుదీర్ఘమైన సార్వత్రిక ఎన్నికల పోరు పరిసమాప్తం అవుతుంది. ఈ కీలక సమయంలో అంటే జనవరి 1వ తేదీన ఢిల్లీలో ప్రతిపక్ష ఇండియా కూటమి భేటీ కానుంది. ఇది అత్యంత కీలకమైన భేటీగా చెబుతున్నారు. ఎందుకంటే ఈ భేటీలో పోలింగ్ సరళిని సమీక్షిస్తారు. అలాగే కూటమి పెర్ఫార్మెన్స్ ని కూడా బేరీజు వేసుకుంటారు. హంగ్ పార్లమెంట్ వస్తే ఏమి చేయాలో కూడా ఆలోచిస్తారు.

మరి ఇంతటి విశిష్టమైన భేటీకి అయితే తాము హాజరు కాబోమని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ఢిల్లీలో జరిగే ఈ సమావేశంలో లోక్ సభ ఎన్నికలు, జూన్ 4న ఫలితాలు, కూటమి భవిష్యత్తుపై చర్చించనున్నాయని తెలిసిన తరువాత కూడా మమత రాను అంటున్నారు అంటే ఆలోచించాల్సిందే అని అంటున్నారు.

ఇండియా కూటమి సమావేశంపై టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ బెంగాల్ లో తొమ్మిది లోక్ సభ స్థానాల్లో అదేరోజు ఎన్నికలు ఉన్నందున తాను ఢిల్లీ సమావేశం కోసం రాలేనని చెప్పానని వెల్లడించారు.

అలాగే పంజాబ్, బీహార్, ఉత్తర ప్రదేశ్‌లలో కూడా జూన్ 1న ఎన్నికలు ఉన్నాయని అందుకే ఢిల్లీకి వెళ్లడం ఆచరణాత్మకం కాదన్నారు. అంతే కాదు తమ సొంత రాష్ట్రంలో ఓ వైపు తుపాను మరోవైపు ఎన్నికలు ఉన్నాయన్నారు.

ఈ నేపథ్యంలో తనకు తుపాను సహాయ కార్యక్రమాలే తనకు తొలి ప్రాధాన్యత అన్నారు. ఏడో దశలో తమకు చాలా కీలకమైన ఎన్నికలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆ రోజున కోల్‌కతా, గ్రేటర్ కోల్‌కతాలోని అన్ని స్థానాలకు పోలింగ్ ఉందని తెలిపారు. తమ పార్టీకి ఇది చాలా కీలకమని పేర్కొన్నారు. ఇంత ఖరాఖండీగా మమత చెప్పడంలోనే వేరే సౌండ్ తోస్తోంది అని అంటున్నారు.

మమత ప్రధాని పీఠాన్ని ఆశిస్తున్నారు. ఇండియా కూటమి తన పేరుని ప్రతిపాదించాలని ఆమె కోరుకుంటున్నారు అని అంటున్నారు. అయితే ఆ రకమైన ఊసే లేదని తేలడంతోనే ఆమె ఇలా అంటున్నారు అన్నది ఒక ప్రచారంగా ఉంది. ఏది ఏమైనా ఎన్డీయే ఇండియా కూటమి నెక్ టూ నెక్ గా సీట్లు సాధిస్తే మమతా బెనర్జీ లాంటి వారు తీసుకునే నిర్ణయమే అత్యంత కీలకం అవుతుందని దేశ రాజకీయ దశ దిశను మారుస్తుందని అంటున్నారు.