ఎవరికీ ప్రధాని పదవి వద్దుట..అవాక్కయ్యారా..?
ఇపుడు లేటెస్ట్ గా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా తనకు ప్రధాని కావాలని కోరిక ఏదీ లేదని తేల్చి చెప్పారు
By: Tupaki Desk | 21 July 2023 3:49 PM GMTప్రధాని పదవి కోసమే ఎవరైనా చేసేది. ప్రధాని కావాలని తపించిన వారు చాలా మంది ఉన్నారు. ఆ మధ్య దివంగతులైన ములాయం సింగ్ యాదవ్ నుంచి చూసుకుంటే ఈ రోజున రాజకీయంగా తగ్గిన బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎనభై మూడేళ్ళ ప్రాయం ఉన్న శరద్ పవార్ అందరూ ఆ అత్యున్నత పీఠం కోసమే కలలు కన్నారు. లాలూ ప్రసాద్ పీఎం అని ఒక దశలో గట్టిగా అనుకున్నారు.
వారి కలలు అలా ఉండగానే మరో తరం వచ్చేసింది. ఇక మమతా బెనర్జీ, నితీష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్ వటి వారు ప్రధాని పదవిని కోరుకుంటున్నారు అన్నది ప్రచారంలో ఉన్న మాట. చిత్రమేంటి అంటే విపక్ష కూటమి అంతా కలసి ఇండియా అన్న పేరుతో కొత్తగా ఐక్యతను చాటుకుని రెండు మీటింగ్స్ పెట్టాక ఒకరి తరువాత మరొకరికి ప్రధాని పదవిపైన వ్యామోహం అలా తగ్గిపోతోంది.
ఇది నిజంగా దేశంలోని 142 కోట్ల మంది ప్రజానీకం ఆశ్చర్యం పడాల్సిన విషయంగానే ఉంది. బెంగళూరులో జరిగిన మీటింగ్ కి హాజరవుతూనే కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ ప్రధాని పదవి తీసుకోదని కుండబద్ధలు కొట్టారు. అసలు రేసులో లేమని చెప్పేశారు.
ఇక దేశంలోని విపక్ష పార్టీలతో చర్చలు వరసబెట్టి జరిపి కూటమి దాకా కధను నడుపుకుని వచ్చిన బీహార్ సీఎం ఏడున్నర పదుల వయసు కలిగిన సీనియర్ మోస్ట్ నేత నితీష్ కుమార్ కూడా తనకు ప్రధాని పదవి మీద ఆశలు లేవని చెప్పేశారు. ఆయన ఇండియా కూటమికి కన్వీనర్ గా కూడా వ్యవహరిస్తున్నారు.
ఇపుడు లేటెస్ట్ గా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా తనకు ప్రధాని కావాలని కోరిక ఏదీ లేదని తేల్చి చెప్పారు. దేశంలో ముందు బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే విపక్ష కూటమి అజెండా అని అన్నారు. ఇండియా కూటమి బీజేపీని ఓడించి తీరుతుందని ఆమె అంటున్నారు.
ఇలా వరసబెట్టి సీనియర్ నేతలు ప్రధాని రేసులో ఉన్న వారు కలసి తమకు పీఎం పోస్ట్ వద్దు అంటే నిజంగా అది తమాషాగా ఉంది అని అంటున్నారు. మరి ఎందుకు ఇలా వీరంతా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అంటే బీజేపీ అపుడే ఇండియా కూటమి మీద తనదైన శైలిలో వ్యతిరేక ప్రచారం చేస్తోంది. ఆ కూటమిలో ప్రధాని పదవి కోసం విపక్ష కూటమిలో చిచ్చు రేగడం ఖాయమని కూడా విమర్శిస్తున్నారు. వారికి పదవి కావాలని తమకు దేశం కావాలని కూడా బీజేపీ నేతలు అంటున్నారు.
ఈ నేపధ్యంలోనే వరసబెట్టి దిగ్గజ నేతలు అంతా తమకు ప్రధాని పదవి మీద మోజు లేదని చెప్పేసుకుంటున్నారు ఇదొక రకం రాజకీయ ఎత్తుగడగా అంటున్నారు. అయితే ప్రజలకు కూడా కూటములు కావాలా వాటి మీద ఎంత వరకూ విశ్వాసం ఉంది అన్నది చూడాలని అంటున్నారు. కూటములకు అధికారం ఇస్తే రాజకీయ స్థిరత్వం ఎంతవరకూ ఉంటుంది అన్నది కూడా తెలివైన భారతీయ ఓటరు చూస్తారు అని అంటున్నారు. మరో వైపు ప్రధాని పదవి వద్దు అని ఏ నేత చెప్పినా జనాలు అవాక్కు అయింది లేదని, వారు ఎంత వరకూ నమ్ముతారు అన్నది కూడా సందేహమే అంటున్నారు.