Begin typing your search above and press return to search.

మోడీ సర్కార్ కూలుతుందా ..ఈ జోస్యం ఎవరిది ?

కేంద్రంలో మధ్యంతర ఎన్నికలు వస్తాయా అంటే జవాబు మాత్రం అవును అని విపక్ష శిబిరం వైపు నుంచి వస్తోంది.

By:  Tupaki Desk   |   13 July 2024 4:20 AM GMT
మోడీ సర్కార్ కూలుతుందా ..ఈ జోస్యం ఎవరిది ?
X

కేంద్రంలో మధ్యంతర ఎన్నికలు వస్తాయా అంటే జవాబు మాత్రం అవును అని విపక్ష శిబిరం వైపు నుంచి వస్తోంది. విపక్షాలకు ఎపుడూ ఎన్నికలు రావాలని ఉంటుంది కాబట్టి అది పట్టించుకోవాల్సింది లేదు అని అనుకున్నా దేశంలో పరిస్థితులు అలాగే ఉన్నాయని అంటున్న వారూ ఉన్నారు.

ఇదిలా ఉంటే బెంగాల్ సీఎం దీదీ మమతా బెనర్జీ అయితే మోడీ ప్రభుత్వం కేంద్రంలో పూర్తి కాలం అధికారంలో కొనసాగకపోవచ్చు అని హాట్ కామెంట్స్ చేశారు. మోడీ ప్రభుత్వం ఏర్పాటులోనే అస్థిరత ఉందని ఆమె అన్నారు. మెజారిటీ బీజేపీకి లేకపోవడాన్ని ఆమె ప్రస్తావిస్తూ కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఫుల్ టీర్మ్ పవర్ ని చలాయించడం అనుమానమే అని అన్నారు.

బీజేపీకి 240 సీట్లు మాత్రమే ఉన్నాయి. 32 సీట్లు తక్కువ వచ్చాయి. తెలుగుదేశం జేడీయూల సహకారంతో ప్రభుత్వ మనుగడ సాగుతోంది. బీహార్ లో 17 మంది ఎంపీలు ప్రత్యేక హోదా మీద కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఏపీ ప్రయోజనాల విషయంలో తెలుగుదేశం పట్టు బడుతోంది. నిన్నటికి నిన్న ఎన్నికలు జరిగాయి, రాజకీయ వాతావరణం పచ్చిగా ఉంది కాబట్టి కొన్నాళ్ళు అయినా ప్రభుత్వం సాగాలన్న ఉద్దేశ్యంతో మిత్రులు మద్దతు ఇవ్వవచ్చు కానీ కాలం ఎపుడూ ఒకేలా ఉండదని అంటున్నారు.

ఇక ఇండియా కూటమి బలంగా ఉంది. వారికి కావాల్సింది 40 మంది ఎంపీల మద్దతు. అది ఉంటే కనుక ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అయితే బీజేపీని దించేసి ఇండియా కూటమి అధికారంలోకి రావాలనుకుంటే మాత్రం అది జరుగుతుందా అన్నది కూడా చర్చగానే ఉంది. ఎందుకంటే తమకు బలం లేదని ఏ మాత్రం అనుమానం ఉన్నా లోక్ సభను రద్దు చేసి మరోమారు ప్రజల వద్దకు తీర్పు కోసం వెళ్ళేందుకే బీజేపీ చూస్తుంది తప్ప అప్పనంగా అధికారాన్ని విపక్ష కూటమికి అందించదు అని అంటున్నారు.

అయితే విపక్ష కూటమి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే మోడీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే పార్టీని వెనక్కి తీసుకుంటే కూలుతుందని ఆ మిగిలిన కాలానికి ఇండియా కూటమి అధికారంలోకి రావచ్చు అన్నది వారి అంచనాలుగా కనిపిస్తోంది. ఇక ఇండియా కూటమి తరఫున పార్లమెంట్ లో రాహుల్ గాంధీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉంటున్నారు. అంటే ఆయన వెయిటింగ్ ప్రైమ్ మినిస్టర్ అన్న మాట.

అలా కాంగ్రెస్ తెలివిగా ముందే రాహుల్ ని కీలక స్థానంలో ఉంచింది. అయితే ఇండియా కూటమిలో ప్రధాని ఆశలు ఉన్న వారు చాలా మందే ఉన్నారు. మరీ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అయితే ఆ పదవి కోసం చూస్తున్నారని అంటున్నారు. ఆమె ముంబైకి తాజాగా వచ్చారు. అంబానీ కుమారుడి వివాహ వేడుకలలో పాల్గొనేందుకు వచ్చిన ఆమె పనిలో పని అన్నట్లుగా మరాఠీ యోధుడు వృద్ధ నేత శరద్ పవార్ ని కలుసుకుని వర్తమాన రాజకీయాల మీద చర్చించారు.

అలాగే శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేతో సమావేశం అయ్యారు. మమత లోక్ సభ ఎన్నికల తరువాత మహారాష్ట్ర నేతలతో భేటీ కావడం ఇదే ప్రథమం. ఆమె మీడియాతో మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో సరికొత్త ఆట మొదలైంది అని అనడం విశేషం. అంటే మెజారిటీ సొంతంగా లేని బీజేపీతో రాజకీయ చెలగాటకు విపక్షం సిద్ధంగా ఉందని మమత చెప్పకనే చెబుతున్నారు అని అంటున్నారు.

ఒక వేళ మోడీ సర్కార్ అనుకోని కారణాల వల్ల కూలితే ప్రధాని పోటీలో మమత కూడా ఉంటారు అని అంటున్నారు. ఏది ఏమైనా మోడీ సర్కార్ అయిదేళ్ల పాలన మీద విపక్షాలు అయితే పూర్తి అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి బీజేపీ నేతలలో ఆ చర్చ అయితే లేదు కానీ పూర్వపు జోష్ అయితే ఎవరిలోనూ కనిపించడం లేదు అని అంటున్నారు.