ఈవీఎంలను బీజేపీ ట్యాంపర్ చేసిందా? ఆ సీఎం రగడ ఇదే!
పోలింగ్ చేసే ఈవీఎంలను బీజేపీ ట్యాంపరింగ్ చేసిందంటూ.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు.
By: Tupaki Desk | 25 May 2024 12:30 PM GMTదేశవ్యాప్తంగా ఆరో దశ పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 58 పార్లమెంటు స్థానాలకు శనివారం పోలింగ్ జరుగుతోంది. అయితే.. అత్యంత తీవ్ర సమ స్యాత్మక ప్రాంతంగా ఉన్న పశ్చిమ బెంగాల్‌లో ఆదిలోనే అతి పెద్ద రగడ తెరమీదికి వచ్చింది. పోలింగ్ చేసే ఈవీఎంలను బీజేపీ ట్యాంపరింగ్ చేసిందంటూ.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. ఈవీఎంలకు బీజేపీ ట్యాగులు కనిపించాయన్నది సీఎం ఆరోపణ.
దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. బంకురా జిల్లాలోని రఘునాథ్ పూర్ పార్లమెంటు స్థానంలో 5 ఈవీఎంలకు బీజేపీ ట్యాగ్ లు కనిపించాయని సీఎం మమత ఆరోపించారు. తద్వారా.. ఓటర్లను ప్రలోభ పెట్టి.. మభ్యపెట్టి తమకు అనుకూలంగా ఓటు వేయించుకునే ప్రయత్నం చేస్తున్నారని.. ఆమె చెప్పుకొచ్చారు. దీనిపై తక్షణమే కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కూడా సీఎం మమత డిమాండ్ చేశారు.
అయితే.. దీనిపై ఎన్నికల సంఘం వాదన వేరేగా ఉంది. సీఎం మమత ఆరోపణలను ఎన్నికల సంఘం అధికారులు తోసిపుచ్చారు. ఈవీఎంలను పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసేటప్పుడు పోటీలో ఉన్న పార్టీల అభ్యర్థులు, వారి ఏజెంట్ల సంతకాలు తీసుకుంటామని.. అందుకే ట్యాగులు ఏర్పాటు చేయాల్సి వచ్చింద ని వివరించింది. రఘునాథ్ పూర్ నియోజకవర్గంలో బీజేపీ తరఫు ప్రతినిధులు మాత్రమే ఉండటంతో ఈవీఎం, వీవీ ప్యాట్ యంత్రంపై వారి సంతకం మాత్రమే తీసుకున్నట్టు ఎన్నికల సంఘం వివరించింది. అయినా కూడా మమత తన ఆరోపణలను కొనసాగించారు. ఈ సీ కేంద్రంతో కుమ్మక్కయిందని.. బీజేపీ చెప్పినట్టే చేస్తోందని ముఖ్యమంత్రి ఆరోపించారు.