8మంది గవర్నమెంట్ టీచర్స్ తో పెళ్లి... ఎవరీ రాజన్!
ఒక మోసగాడు ఏకంగా ఎనిమిది మంది గవర్నమెంట్ టీచర్స్ ని వివాహం చేసుకున్నాడు.
By: Tupaki Desk | 23 March 2025 6:08 PMఏకంగా ఎనిమిది మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను వివాహం చేసుకుని, వారితో బ్యాంక్ లోన్స్ పెట్టించి, అనంతరం ఆ డబ్బుతో పారిపోయి, ఈ ప్రక్రియలో కోట్ల రూపాయలు సంపాదించిన ఓ వ్యక్తి వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు గవర్నమెంట్ టీచర్స్ తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఇతగాడి వివాహాల జాబితా వెలుగులోకి వచ్చింది.
అవును... ఒక మోసగాడు ఏకంగా ఎనిమిది మంది గవర్నమెంట్ టీచర్స్ ని వివాహం చేసుకున్నాడు. వారిలో ఎక్కువ మందిని బ్యాంకు లోన్స్ తీసుకునేలా ఒప్పించేవాడు.. అనంతరం ఆ డబ్బు తీసుకుని పారిపోయేవాడు. ఈ ప్రక్రియలో కోట్ల రూపాయల డబ్బు సంపాదించినట్లు చెబుతున్నారు. ఆ వివరాలేమిటో ఇప్పుడు చూద్దామ్..!
ఉత్తరప్రదేశ్ లోని సోన్ భద్ర లో ఇద్దరు మహిళా ప్రభుత్వ టీచర్లు పోలీసులను ఆశ్రయించారు. తమ భర్త పేరు రాజన్ గెహ్లాట్ అని ఇద్దరూ ఫిర్యాదు చేశారు. తమను వివాహం చేసుకుని, అనంతరం డబ్బుతో పారిపోయాడని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరితో పాటు మరో ఆరుగురు ప్రభుత్వ టీచర్లు అయిన మహిళలను రాజన్ గెహ్లాట్ మోసం చేసినట్లు చెబుతున్నారు.
స్థానిక అంబేద్కర్ నగర్ కు చెందిన ఓ గవర్నమెంట్ టీచర్ అయిన ఒక మహిళ 2014లో ఆన్ లైన్ మ్యారేజ్ పోర్టల్ ద్వారా రాజన్ గెహ్లాట్ ను కలిసినట్లు పోలీసులకు తెలిపారు. ఈ క్రమంలో.. రాజన్ గెహ్లాట్ తనను తాను ప్రభుత్వ ఉద్యోగిగా పరిచయం చేసుకున్నాడని.. ఆ తర్వాత ఇద్దరూ వివాహం చేసుకున్నారని వెల్లడించారు.
ఈ క్రమంలో... 2016లో తనకు కొంత భూమి కొన్ని ఇల్లు కట్టించాలని కోరుకుంటున్నట్లు చెప్పి రూ.40 లక్షల బ్యాంక్ రుణం తీసుకునేలా చేశాడని ఆ మహిళ ఆరోపించింది. రుణం పొందిన అనంతరం.. అతడు ఒకరోజు అకస్మాత్తుగా తన జీవితం నుంచి అదృశ్యమై షాక్ కు గురయ్యాడని తెలిపారు. సంవత్సరాలుగా అతడి కోసం వెతుతుకున్నట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలోనే 2020లో స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినట్లు వెల్లడించారు. అయితే ఈ ఏడాదిలో ఆ మహిళ సంత్ కబీర్ నగర్ కు చెందిన మరో టీచర్ ను కలిసింది. అయితే.. ఆమె కూడా రాజన్ చేతిలో మోసపోయినట్లు తెలుసుకుందట. 2019లో అతడు తనను కలిసాడని, తనను తాను ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ అధికారిగా పరిచయం చేసుకున్నాడని ఆ రెండో మహిళ తెలిపారు.
ఈ క్రమంలో 2022లో ఇల్లు కట్టుకోవడానికని రూ.42 లక్షలు అవసరమని ఆమెకు కూడా చెప్పి.. బ్యాంక్ రుణం తీసుకోవాలని అడిగాడని తెలిపారు. ఆమె బ్యాంక్ లోన్ తీసుకోగానే.. ఆ డబ్బుతో అతడు పరారైపోయాడని తెలిపారు. ఇలా వీరిద్దరే కాదు.. మరో ఆరుగురిని మోసం చేసినట్లు చెబుతున్నారు.
దీనిపై స్పందించిన సోన్ భద్ర అడిషనల్ ఎస్పీ కలు సింగ్... బాధిత మహిళల ఫిర్యాదు మేరకు నిందితుడు రాజన్ గెహ్లాట్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అయితే.. నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం వెతుకుతున్నట్లు చెప్పారు.