తోక పట్టుకుని చిరుత ఆటకట్టు... యోగానంద్ వీడియో వైరల్!
అటవీ ప్రాంతాలకు సమీపంగా ఉన్న గ్రామాల్లోకి అడవి జంతువులు అప్పుడప్పుడూ వస్తుండటం తీవ్ర కలకలం రేపుతుంటుంటుందనే సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 9 Jan 2025 4:12 AM GMTఅటవీ ప్రాంతాలకు సమీపంగా ఉన్న గ్రామాల్లోకి అడవి జంతువులు అప్పుడప్పుడూ వస్తుండటం తీవ్ర కలకలం రేపుతుంటుంటుందనే సంగతి తెలిసిందే. వీటిలో రాత్రి పూట కాలనీల్లోకి వచ్చిన అడవి జంతువులకు సంబంధించిన వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తుంటాయి. మరికొన్ని జంతువులు పగలే వచ్చి.. ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తుంటాయి.
అలా ఊరిలోకి వచ్చిన అడవి జంతువులను చూసి ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతారు. ఆ గ్రామంలోని మనుషులతో పాటు మూగ జీవాలకు ఇవి ఎక్కడ హాని కలిగిస్తాయో అని కంగారు పడుతుంటారు. ఈ సమయంలో అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడం, వారు వచ్చి వాటికి మత్తు మదు ఇచ్చి పట్టుకుని, తిరిగి అడవిలో విడిచి పెట్టడం జరుగుతుంటుంది.
అయితే.. తాజాగా అలాంటి ఘటనే జరిగింది. ఇందులో భాగంగా... కర్ణాటక రాష్ట్రంలోని తమకురు జిల్లా చిక్కకొట్టిగేహళ్లీ గ్రామంలోకి ఓ చిరుత వచ్చింది. ఈ సమాచారంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మరోపక్క అటవీశాఖ అధికారులకూ సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో ఆ చిరుతను స్థానికుడు ఒంటి చేత్తో నిలువరించడం సంచలనంగా మారింది.
అవును... పురలేహళ్లి రహదారిలోని కుమార్ అనే వ్యక్తి ఇంటి వద్దకు చిరుత పులి వచ్చిందని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందింది. దీంతో... దాన్ని పట్టుకునేందుకు మత్తు ఇంజక్షన్లు, ఆయుధాలు, బోనులతో అటవీశాఖ అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. అయితే.. ఎంత గాలించినా దొరక్కుండా తప్పించుకుంటుంది.
ఈ సమయంలో చిరుత పొదల్లోకి వెళ్లడం కనిపించింది. దీంతో... అలా పొదల్లోకి వెళ్తున్న చిరుత వెంటపడిన ఆనంద్ అలియాస్ యోగానంద్ (43) అనే వ్యక్తి ధైర్యం చేసి దాని తోకను పట్టుకుని నియంత్రించాడు. అనంతరం అటవీ సిబ్బంది వెంటనే దానిపై వల వేసి బంధించారు. అనంతరం బోనులోకి ఎక్కించారు. దీనికి సంబంధించిన వీడియో సంచలనంగా మారింది.
ఈ సందర్భంగా స్పందించిన యోగానంద్... తమ గ్రామంలో మహిళలు, పిల్లలు, మూగ జీవాలు ఉన్నాయని.. ఈ చిరుత ఇప్పుడు తప్పించుకుంటే మళ్లీ గ్రామంలోకి వస్తుందని.. దాన్ని బంధించేంత వరకూ ఎవరు నిద్రపోలేరని.. ఆ కారణంతోనే అంత ధైర్యం చేసి చిరుతను పట్టుకున్నానని యోగానంద్ వివరించారు.