డేటింగ్ యాప్ లో ప్రేమ.. రూ.6.3 కోట్లు స్వాహా
తాజాగా నోయిడాకు చెందిన ఓ వ్యక్తి డేటింగ్ యాప్‌లో పరిచయమైన మహిళను నమ్మి ఏకంగా రూ. 6.3 కోట్లు పోగొట్టుకున్నాడు.
By: Tupaki Desk | 30 March 2025 1:30 AMనేటి కాలంలో సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త ఎత్తుతో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా నోయిడాకు చెందిన ఓ వ్యక్తి డేటింగ్ యాప్‌లో పరిచయమైన మహిళను నమ్మి ఏకంగా రూ. 6.3 కోట్లు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
నోయిడాకు చెందిన దల్జీత్ సింగ్ అనే వ్యక్తి ఢిల్లీలో ఓ సంస్థకు డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. విడాకులు తీసుకున్న అనంతరం ఒంటరిగా ఉంటున్న ఆయన ఓ డేటింగ్ యాప్‌లో తన ప్రొఫైల్‌ను క్రియేట్ చేశాడు. అలా ఆయనకు ‘అనిత’ అనే పేరుతో ఓ మహిళ పరిచయమైంది. తాను హైదరాబాద్‌కు చెందిన వ్యక్తినని ఆమె చెప్పడంతో వారిద్దరి మధ్య సంభాషణలు మొదలయ్యాయి. కొద్ది రోజుల్లోనే వారి స్నేహం బలపడింది. దల్జీత్ తనను పూర్తిగా నమ్ముతున్నాడని గ్రహించిన అనిత తన అసలు పథకాన్ని అమలు చేయడం ప్రారంభించింది.
స్వల్పకాలంలోనే అధిక లాభాలు పొందవచ్చని నమ్మబలుకుతూ ట్రేడింగ్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టమని అనిత దల్జీత్‌ను ప్రోత్సహించింది. ఇందుకోసం మూడు వెబ్‌సైట్ల పేర్లను కూడా సూచించింది. ఆమె మాటలు నమ్మిన దల్జీత్ తొలుత రూ. 3.2 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఆశ్చర్యకరంగా కొద్ది గంటల్లోనే అతనికి రూ. 24 వేల లాభం వచ్చింది. ఆ మొత్తాన్ని తన బ్యాంకు ఖాతాకు బదిలీ చేసుకోవడంతో అనితపై అతనికి మరింత నమ్మకం కలిగింది.
ఆ తర్వాత అనిత సలహా మేరకు దల్జీత్ తను దాచుకున్న రూ. 4.5 కోట్ల సేవింగ్స్‌తో పాటు మరో రూ. 2 కోట్లు అప్పు చేసి మొత్తం రూ. 6.5 కోట్లు వివిధ దఫాలుగా పెట్టుబడి పెట్టాడు. అయితే, ఆ డబ్బును తిరిగి విత్‌డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా అది సాధ్యం కాలేదు. పెట్టుబడిలో కేవలం 30 శాతం మాత్రమే విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉందని అతనికి ఒక సందేశం వచ్చింది. దీనికి దల్జీత్ నిరాకరించాడు. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా డబ్బు విత్‌డ్రా కాలేదు. కొద్ది రోజులకే అనిత సూచించిన మూడు వెబ్‌సైట్లు కూడా పనిచేయడం మానేశాయి. దీంతో తాను మోసపోయానని గ్రహించిన దల్జీత్ వెంటనే నోయిడా సెక్టార్-36 సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా అనిత ప్రొఫైల్ ఫేక్ అని తేలింది. ఈ తరహా మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆన్‌లైన్‌లో పరిచయమైన వ్యక్తులను గుడ్డిగా నమ్మవద్దని, ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.