Begin typing your search above and press return to search.

మన్మోహన్ సింగ్ కి భారతరత్న...బీజేపీ ఏం చేయబోతోంది ?

ఇటీవల మృతి చెందిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎంతటి మేధావి ఎంతటి గొప్పవారు అన్నది అందరికీ తెలిసిందే.

By:  Tupaki Desk   |   30 Dec 2024 4:30 AM GMT
మన్మోహన్ సింగ్ కి భారతరత్న...బీజేపీ ఏం చేయబోతోంది ?
X

ఇటీవల మృతి చెందిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎంతటి మేధావి ఎంతటి గొప్పవారు అన్నది అందరికీ తెలిసిందే. అది ఆయన మరణానంతరం బయటకు రావడం ఇంకా విశేషం. ఆయన జీవించి ఉన్న రోజులలో కంటే మరణించాకనే వేయి నోళ్ల పోగిడించుకున్నారు. ఇంతటి ఆర్ధిక నిపుణుడు లేడు అనిపీంచుకున్నారు.

అంతే కాదు ఈ రోజు భారత దేశం తాను ప్రపంచంలో అత్యంత బలమైన ఆర్థిక వ్యవస్థగా చెప్పుకుంటోంది అంటే పునాదులు వేసి పరిపుష్టం చేసిన ఘనత మన్మోహన్ సింగ్ దే అని తేటతెల్లమైన తరువాత ఆయన కీర్తి మరింతగా విస్తరిస్తోంది. దాంతో పాటుగా ఆయనకు భారత రత్న ప్రకటించాలని డిమాండ్ కూడా ఉంది.

ఆయనకు అత్యున్నత పౌర పురస్కారం ప్రకటించాలీ అంటే అది బీజేపీ నాయాకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పెద్దల చేతులలో ఉంది. కేంద్రం తలచుకుంటే అది సుసాధ్యమే అవుతుంది. పైగా దేశమంతా దానిని ఆమోదిస్తారు.

అందువల్ల ఈ విషయం మీద బీజేపీ పెద్దలు సీరియస్ గానే ఆలోచించవచ్చు అని అంటున్నారు. ప్రతీ ఏటా జనవరి 26న పద్మ పురస్కారాల గ్రహీతల జాబితాను విడుదల చేస్తారు. దానితో పాటుగానే భారత రత్న ఎవరికి ఇస్తారో వారి పేర్లు కూడా విడుదల చేస్తారు.

అలా చూసుకుంటే అతి తక్కువ రోజులలోనే ఈ అవార్డు ఎవరికి దక్కుతుందో తెలుస్తుంది. గత సారి రెండు మూడు విడతలుగా కొందరు ప్రముఖులకు భారత రత్న అవార్డుని కేంద్రం ప్రకటించింది. ఈసారి కొత్త ఏడాదికి కొద్ది రోజుల ముందే కన్ను మూసిన మన్మోహన్ సింగ్ పేరుని భారత రత్న అవార్డుల జాబితాలో చేర్చవచ్చు అని అంటున్నారు

మన్మోహన్ సింగ్ కి బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించింది. ఆయన స్మారక చిహ్నం కోసం భూమిని కేటాయించాలని ఆలోచన చేస్తోంది. దాంతో ఇపుడు భారత రత్న కూడా ఇచ్చేందుకు వీలు ఉంటుందేమో అని అంతా ఆలోచిస్తున్నారు.

ఎందుకంటే ఆయన గాంధీ కుటుంబీకుడు కాదు, కాంగ్రెస్ పార్టీకి రెండు దఫాలు ప్రధానిగా చేసిన ఒక సాధారణ నాయకుడు. పైగా ఆయన ఆర్థిక విధానాలు సర్వజనామోదం పొందాయి. దాంతో ఆయనకు భారత రత్న ప్రకటించడం ద్వారా బీజేపీ ఆయన అభిమానులను కూడా సంతోషపెట్టేందుకు యత్నించవచ్చు అని అంటున్నారు.

అలా కాంగ్రెస్ చేయలేని పనులను తాము చేశామని మహనీయులను పెద్దలను గౌరవించడంలో తరతమ భేదాలు చూపించలేదని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ మీద పై చేయి సాధించవచ్చు అని అంటున్నారు. గతంలో ప్రణబ్ ముఖర్జీకి కూడా భారర రత్న అవార్డుని బీజేపీ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అందువల్ల మన్మోహన్ సింగ్ కి ఆ అత్యున్నత గౌరవం దక్కవచ్చు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.