వీడియో: 108 ను వెంటాడిన 100... క్లైమాక్స్ లో షాకింగ్ ట్విస్ట్!
హైదరాబాద్ - విజయవాడ నేషనల్ హైవేపై 108 అంబులెన్స్ హల్ చల్ చేసింది. సినిమా షూటింగ్ అనుకునే స్థాయిలో వాతావరణం క్రియేట్ చేసింది.
By: Tupaki Desk | 7 Dec 2024 10:15 AM GMTరోడ్లపై అంబులెన్స్ వెళ్తుంటే వాహనదారులు దారి ఇవ్వాలని.. రోడ్డు ఇరుకుగా ఉన్న చోట తమ తమ వాహనాలు పక్కకు ఆపి, అంబులెన్స్ కు దారి ఇవ్వాలని అంతా కోరుతుంటారు.. ఈ విషయంలో నిబంధనలు అతిక్రమించిన వారిపై పోలీసులు చర్యలు కూడా తీసుకుంటున్నారు. అయితే... తాజాగా అంబులెన్స్ ను పోలీసులే వెంటాడి మరీ ఆపారు! దీనికి సంబంధించిన వీడియో షాకింగ్ గా ఉంది.
అవును... హైదరాబాద్ - విజయవాడ నేషనల్ హైవేపై 108 అంబులెన్స్ హల్ చల్ చేసింది. సినిమా షూటింగ్ అనుకునే స్థాయిలో వాతావరణం క్రియేట్ చేసింది. నేషనల్ హైవేపై అత్యంత వేగంగా సైరన్ వేసుకుంటూ అంబులెన్స్ వెళ్తుండగా.. దాని వెనుక ఛేజింగ్ సీన్ తరహాలో పోలీస్ వాహనం రయ్ రయ్ అంటూ వెంబడించింది. దీని వెనకున్న అసలు కథ ఏమిటనేది ఇప్పుడు చుద్దామ్!
ఓ వ్యక్తి హైదరాబాద్ లోని 108 వాహనాన్ని హయత్ నగర్ లో చోరీ చేసి,ఖమ్మం మీదుగా విజయవాడకు హైవేపై ఈలేసుకుంటూ బయలుదేరాడు! దీంతో... విషయం తెలుసుకున్న పోలీసులు 108 వాహనాన్ని తమ 100 వాహనంతో ఛేజ్ చేయడం మొదలుపెట్టారు. ఈ ఛేజింగ్ హయత్ నగర్ నుంచి నకిరేకల్ వరకూ జరగడం గమనార్హం!
ఈ క్రమంలో చిట్యాల వద్ద అంబులెన్స్ ను ఆపడానికి ప్రయత్నించిన ఎస్సై జాన్ రెడ్డిని ఢీకొట్టి మరీ ఆ దొంగ అంబులెన్స్ తో దూసుకుపోయాడు. ఇదే తరహాలో కొర్లపహాడ్ టోల్ గేట్ వద్ద టోల్ గేట్ ను ఢీకొట్టి మరీ అంబులెన్స్ ను ముందుకు దూకించాడు ఆ దొంగ. అయితే ఆఖరికి టెకుమట్ల స్టేజ్ వద్ద దొంగను పట్టుకున్నారు.
అది కూడా పుష్ప సినిమాలో ఎర్ర చందనం లారీలకు పోలీసులు ఎడ్ల బళ్లు అడ్డుబెట్టిన తరహాలో! అనంతరం అంబులెన్స్ దొంగను పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో... అటు 108 సిబ్బంది, ఇటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇక్కడ బిగ్ ట్విస్ట్ ఏమిటంటే... హయత్ నగర్ నుంచి అంబులెన్స్ ను దొంగిలించి విజయవాడ వైపు వయా ఖమ్మం తీసుకెళ్తున్న వ్యక్తి మతి స్థితిమితం లేనివాడని తేలిందంట! ఇతడు గతంలోనూ ఇదే విధంగా అంబులెన్స్ ను చోరీ చేసి తీసుకెళ్లాడని అంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.