ఫుల్ గా తాగేసి.. ఆర్టీసీ బస్సు స్టెప్నీ టైరు మీద పడుకొని జర్నీ
అంత దూరం ప్రయాణించిన తర్వాత కూడా ఏమీ కాకపోవటం చూస్తే.. లక్కీ ఫెలో అనుకోకుండా ఉండలేం.
By: Tupaki Desk | 16 March 2025 10:02 AM ISTవిన్నంతనే ఓర్నీ అనిపించే ఈ ఉదంతం ఉమ్మడి అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. ఫుల్ గా తాగేసిన ఒకడు బస్సు వెనుకున్న స్టెఫ్నీ టైరు మీద పడుకొని ఇరవై కిలోమీటర్లు ప్రయాణించిన వైనం వెలుగు చూసింది. అంత దూరం ప్రయాణించిన తర్వాత కూడా ఏమీ కాకపోవటం చూస్తే.. లక్కీ ఫెలో అనుకోకుండా ఉండలేం.
శనివారం మధ్యాహ్నం పన్నెండున్నర గంల సమయంలో కొత్త చెరువు నుంచి హిందూపురానికి ఆర్టీసీ బస్సు బయలుదేరింది. పెనుకొండ సమీపంలోని రాంపురం వద్ద బస్సు వెళుతున్న వేళలో.. టూవీలర్ మీద వెళుతున్న వారు.. బస్సును అర్జెంట్ గా ఆపాలంటూ సైగలు చేయటంతో బస్సు డ్రైవర్ బస్సు ఆపాడు. బస్సు కింద భాగంలో కాళ్లు వేలాడుతున్నట్లుగా చెప్పటంతో డ్రైవర్ షాక్ తిన్నాడు.
వెంటనే.. వెనక్కి వెళ్లి బస్సు వెనకు భాగంలో కింద ఉంచే స్టెప్నీ టైరులో ఎవరో ఉన్నట్లుగా గుర్తించారు. చివరకు మద్యంమత్తులో ఉన్న వ్యక్తి స్టెప్నీ టైరునుంచి కిందకు దిగటంతో అవాక్కు అయ్యారు. అతడి వివరాలు అడిగితే చెప్పకపోవటంతో.. అతడ్ని మందలించి పంపేశారు. 20 కిలోమీటర్లు ప్రయాణించినా... ఎలాంటి ప్రమాదం కాకపోవటంతో తమకు పెద్ద గండం తప్పిందంటూ బస్సు డ్రైవర్.. కండెక్టర్ విజయలక్ష్మితో పాటు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. ఈ ఉదంతం ఆర్టీసీ వర్గాల్లో సంచలనంగా మారింది.