Begin typing your search above and press return to search.

భార్య కోసం వీఆర్ఎస్.. రిటైర్మెంట్ రోజునే చనిపోయింది!

సదరు రాష్ట్రానికి చెందిన కోటా ప్రాంతానికి చెందిన దేవేంద్ర సందాల్ కేంద్ర గిడ్డంగుల విభాగంలో పని చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   26 Dec 2024 4:48 AM GMT
భార్య కోసం వీఆర్ఎస్.. రిటైర్మెంట్ రోజునే చనిపోయింది!
X

విన్నంతనే ఉలిక్కిపడే షాకింగ్ ఉదంతంగా దీన్ని చెప్పాలి. అనారోగ్యంగా ఉన్న భార్య బాగోగుల కోసం ఒక భర్త తన ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. రిటైర్మెంట్ చివరి రోజున నిర్వహించిన ఫంక్షన్ రోజునే ఆమె కన్నుమూసిన విషాద ఉదంతంగా దీన్ని చెప్పాలి. ఆమె చివరి రోజుల్లో తాను దగ్గర ఉండి అన్నీ చూసుకోవాలని తలంచిన ఆ భర్త వేదన ఇప్పుడు ఆరణ్యరోదనగా మారింది. ఈ ఉదంతం గురించి విన్నోళ్లే వేదనకు గురయ్యేలా ఉంటే.. అలాంటిది ఈ ఉదంతాన్ని దగ్గరగా చూసే వారి పరిస్థితి మరెలా ఉంటుంది? రాజస్థాన్ లో చోటు చేసుకున్న ఈ విషాదంలోకి వెళితే..

సదరు రాష్ట్రానికి చెందిన కోటా ప్రాంతానికి చెందిన దేవేంద్ర సందాల్ కేంద్ర గిడ్డంగుల విభాగంలో పని చేస్తున్నారు. ఆయన సతీమణి దీపిక ఇంటి వద్దే ఉంటారు. ఆమె కొంతకాలంగా గుండె సంబంధించిన ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వారికి పిల్లల్లేరు. దీంతో అనారోగ్యంగా ఉన్న భార్య కోసం.. ఆమె బాగోగులు చూసుకోవటానికి వీలుగా దేవేంద్ర.. తన సర్వీసు మరో మూడేళ్లు ఉన్నప్పటికి వీఆర్ఎస్ కు అప్లై చేశారు.

ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్ ను ఆఫీసు వారు నిర్వహించారు. ఈ ప్రోగ్రాంకు దీపిక కూడా హాజరయ్యారు. దేవేంద్ర దంపతుల్ని కుర్చీలో కూర్చోబెట్టి.. పూలమాలలతో సత్కరించారు. ఒక్కొక్కరుగా ఫోటోలు దిగుతున్నారు. ఆహ్లాదభరితంగా సాగుతున్న వాతావరణంలో దీపిక ఒక్కసారిగా వెనక్కు పడిపోయారు. దీంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే.. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లుగా వైద్యులు తెలిపారు. దీంతో.. అక్కడి వారంతా షాక్ కు గురయ్యారు. దేవేంద్ర వేదన వర్ణణాతీతంగా మారింది. అతడి సన్నిహితులు సైతం తీవ్ర విషాదంలో మునిగిపోయారు