17,000 అడుగుల ఎత్తులో కైలాసానికి డైరెక్ట్ రోడ్డు!
సాధారణంగా టిబెట్ లోని హిమాలయాలలో నెలకొని ఉన్న పుణ్యక్షేత్రమైన కైలాష్ మానసరోవర్ ను చేరుకోవడానికి భక్తులు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావనేది తెలిసిన విషయమే.
By: Tupaki Desk | 23 July 2023 1:27 PM GMTసాధారణంగా టిబెట్ లోని హిమాలయాలలో నెలకొని ఉన్న పుణ్యక్షేత్రమైన కైలాష్ మానసరోవర్ ను చేరుకోవడానికి భక్తులు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావనేది తెలిసిన విషయమే. ఈ సందర్భంగా కైలాస పర్వతాన్ని దర్శించుకోవాలని ప్లాన్ చేస్తున్న భక్తులకు కచ్చితంగా ఇది గుడ్ న్యూసే!
కైలాసపర్వతాన్ని సందర్శించాలని భక్తులు సుమారు ఐదురోజుల పాటు ట్రెక్కింగ్ చేసి, ఎన్నో సాహసాలు చేసి, మరెన్నో కష్టాలను, వాతావరణ పరిస్థితులను ఓర్చుకుని ఈ ప్రయాణం చేస్తుంటారు. అయితే ఈ ఏడాది చివరి తర్వాత ఇకపై ఆ కష్టాలు ఉండవని తెలుస్తుంది. ఈ మేరకు కేంద్రప్రభుత్వం మొదలుపెట్టిన రహదారి పూర్తవ్వబోతోందని అంటున్నారు.
అవును... ఉత్తరాఖండ్ రాష్ట్రం నుండి డైరెక్టుగా కైలాస పర్వతానికి కేంద్రప్రభుత్వం రోడ్డును నిర్మిస్తోంది. ఆ రోడ్డు నిర్మాణం త్వరలో పూర్తవబోతోందని తెలుస్తుంది. అన్నీ అనుకూలంగా జరిగితే ఈ ఏడాది చివరినాటికి ఈ రహదారి అందుబాటులోకి రావొచ్చని తెలుస్తుంది.
కైలాసపర్వతంపైన పరమశివుడు కొలువయ్యుంటారని కోట్లాదిమంది భక్తులు నమ్ముతున్నారు. మానససరోవరం కూడా భారత్ - చైనా సరిహద్దుల్లో ఉన్న కైలాస పర్వతంలోనే ఉంది. టెక్నికల్ గా ఈ కైలాసపర్వతంలో కొంత భూభాగం చైనా పరిధిలోకి వస్తుంది.
దీంతో కైలాస పర్వతాన్ని సందర్శించుకోవాలనుకునే భక్తులకు చైనా ప్రభుత్వం అనుమతి కూడా అవసరమవుతోంది. అందుబాటులో ఉన్న ట్రెక్కింగ్ రహదారి వెంట వెళ్లలేనివారు... పూర్తిగా చైనా, నేపాల్ నుంచి వెళ్లాల్సి వస్తోంది. ఈ సమయంలో భక్తుల ఇబ్బందులను అర్ధం చేసుకున్న ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
ఇందులో భాగంగా ఉత్తరాఖండ్ లోని పితోర్ ఘర్ నుంచి నేరుగా కైలాస మానసరోవర్ కు రహదారిని నిర్మిస్తోంది. ఈ పితోర్ ఘర్ ఢిల్లీ నుండి 490 కి.మీ దూరంలో ఉంది. ఈ కొత్త మార్గం నేపాల్, చైనాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. ఈ ప్రాజెక్టు పనులు ఇప్పటికే 85 శాతం పూర్తయ్యాయని తెలుస్తుంది.
ఈ రహదారి పూర్తయిపోతే కైలాష్ మానసరోవర్ ను చేరుకోవడానికి కారులో కేవలం ఒక రోజు పడుతుందని అంటున్నారు. ఈ ప్రాజెక్టు కోసం సుమారు రూ.440 కోట్లు కేంద్రం కేటాయించగా... పనులు 2018లో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బి.ఆర్.ఓ.) ద్వారా ప్రారంభించబడ్డాయి!
లాష్ మానసరోవర్ టిబెట్ లోపల లిపు లేఖ్ సరిహద్దు నుండి కేవలం 16 కి.మీ. దూరంలో ఉంది. ఈ లిపు లేఖ్... భారతదేశం, నేపాల్, చైనాల ట్రై జంక్షన్ సరిహద్దులో 17,000 అడుగుల ఎత్తులో ఉంది. ఈ లిపులేఖ్ పాస్ నుండి 100 కిలోమీటర్లు ప్రయాణిస్తే కైలాసపర్వతం వస్తుంది.
దీంతో కేంద్రం చేపట్టిన ఈ రోడ్డులో చివరి 5 కి.మీ విభాగం కుడి వైపున పెద్ద నది మరియు ఎడమ వైపు నిటారుగా ఉన్న కొండలు ఉన్నాయని అంటున్నారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తియపోతే వెంటనే భక్తులను అనుమతించాలని కేంద్రం సిద్ధంగా ఉంది. ఈ మార్గం పూర్తయితే కైలాస యాత్రతోపాటు ఎట్టకేలకు సరిహద్దు గ్రామాలకు మాత్రం తొలిసారిగా రహదారులు అనుసంధానం అయ్యే అవకాశం ఉంది!