ప్రశాంత దేశంలో ప్రధానిపైనే దాడి
ప్రశాంతమైన జీవనానికి పెట్టింది పేరుగా చెప్పే డెన్మార్క్ లో ఆ దేశ ప్రధానమంత్రి 46 ఏళ్ల మెట్టె ఫ్రెడెరిక్సన్ పై దాడి జరిగింది.
By: Tupaki Desk | 9 Jun 2024 6:07 AM GMTఅంతర్జాతీయంగా అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ప్రశాంతమైన జీవనానికి కేరాఫ్ అడ్రస్ గా చెప్పే యూరోపియన్ దేశాల్లో ఇటీవల కాలంలో కొత్త అలజడులు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా అలాంటి ఉదంతం ఒకటి చోటు చేసుకొని సంచలనంగా మారింది. ప్రశాంతమైన జీవనానికి పెట్టింది పేరుగా చెప్పే డెన్మార్క్ లో ఆ దేశ ప్రధానమంత్రి 46 ఏళ్ల మెట్టె ఫ్రెడెరిక్సన్ పై దాడి జరిగింది.
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమెను బలంగా తోసేసిన ఘటన షాకింగ్ గా మారింది. డెన్మార్క్ రాజధాని కోపెన్ హాగెన్ లోని కుల్వోర్వెట్ స్క్వేర్ వద్ద సోషల్ డెమోక్రాట్ల తరఫున ప్రధానమంత్రి ప్రచార కార్యక్రమాన్నిచేపట్టారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రిని ఒకరు తన చేత్తో బలంగా తోసేశారని.. దీంతో ఆమె పక్కకు తూలి పడిపోయినట్లుగా వెల్లడించారు. అయితే.. ఈ ఘటనలో ప్రధానమంత్రికి ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొన్నారు.
‘కోపెన్ హాగెన్ లోని కల్టోర్ వెట్ ప్రాంతంలో ప్రధానిపై ఒక వ్యక్తి దాడికి పాల్పడ్డారు. భద్రతా సిబ్బంది అతడ్ని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో ప్రధాని షాక్ కు గురయ్యారు’’ అంటూ ప్రధానమంత్రి కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. అదే సమయంలో ఆమె తాజా ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. అత్యంత చిన్న వయసులో డెన్మార్క్ ప్రధానిగా ఆమె 2019లో బాధ్యతలు చేపట్టారు.
డెన్మార్క్ దేశ పార్లమెంట్ కు ఆదివారం ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె పాల్గొన్న ప్రచారంలో ఈ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. దాడి ఘటనలో ఆమెకు ఎలాంటి గాయం కాకున్నా.. ఆమె షాక్ కు గురైనట్లుగా తెలుస్తోంది. దీంతో.. ఆమె తన అధికారిక కార్యక్రమాల్ని రద్దు చేసుకున్నారు. ఈ పరిణామం ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఈ దాడి ఘటనపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందిస్తూ.. తీవ్రంగా తప్పు పట్టారు. ఐరోపా యూనియన్ కు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలసిందే. కొద్ది వారాల క్రితం యూరోపియన్ కూటమి దేశాల్లో ఒకటైన స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోపై ఒక దుండగుడు కాల్పులకు పాల్పడటం.. ఆ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడటం తెలసిందే. ఆ షాక్ నుంచి బయటకు వస్తున్న వేళలోనే మరో దాడి జరగటం చర్చనీయాంశంగా మారింది.