భార్య కోసం పాక్ నుంచి హైదరాబాద్ కు వచ్చి పాతబస్తీలో తిష్ట
పాకిస్థాన్ కు చెందిన వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్న ఉదంతం తాజాగా సంచలనంగా మారింది.
By: Tupaki Desk | 1 Sep 2023 4:49 AM GMTపాకిస్థాన్ కు చెందిన వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్న ఉదంతం తాజాగా సంచలనంగా మారింది. హైదరాబాద్ స్థానికుడిగా ఆధార్ పొందే ప్రయత్నంలో స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులకు చిక్కిపోయాడు. ఇతగాడ్ని అదుపులోకి తీసుకొని విచారించిన అధికారులు.. అతగాడి స్టోరీని చెప్పుకొచ్చారు. విదేశాల్లో పెళ్లి చేసుకున్న భార్య కోసం హైదరాబాద్ కు రావటం వరకు ఓకే కానీ.. అదేదో నిబంధనలకు అనుగుణంగా వచ్చి ఉంటే బాగుండేది. కానీ.. అందుకు భిన్నంగా వ్యవహరించిన అతనిప్పుడు జైలుపాలయ్యాడు. రీల్ స్టోరీ మాదిరి ఉన్న ఈ రియల్ స్టోరీలో ఇప్పటివరకు వచ్చిన అంశాలన్నీ వాస్తవాలేనా? అందులో ఏమైనా కల్పితాలు ఉన్నాయా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
పాకిస్థాన్ లోని ఖైబర్ పఖ్తూంఖ్వా చెందిన 24 ఏళ్ల ఫయాజ్ అహ్మద్ ఉపాధి కోసం 2018లో పాక్ నుంచి షార్జా వెళ్లాడు. అక్కడి సైఫ్ జోన్ వస్త్రపరిశ్రమలో పని దొరికింది. అదే సమయంలో హైదరాబాద్ లోని బహదూర్ పుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే 29 ఏళ్ల నేహ ఫాతిమా సైతం ఉద్యోగం కోసం వెళ్లింది. ఈ క్రమంలో ఆమెకు జాబ్ దొరికేందుకు ఫయాజ్ సాయం చేశాడు. దీంతో.. వీరిద్దరి మధ్య పరిచయం పెరిగి పెద్దదై.. ప్రేమగా మారింది. అనంతరం వారు షార్జాలోనే పెళ్లి చేసుకున్నారు.
వారికి ఒక అబ్బాయి ఉన్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాత అంతా తప్పుల మీద తప్పులు జరిగిపోయాయి. గత ఏడాది ఫాతిమా ఒక్కతే షార్జా నుంచి హైదరాబాద్ కు వచ్చేసింది. ఫయాజ్ పాక్ కు వెళ్లిపోయాడు. ఈ క్రమంలో ఫాతిమా తల్లిదండ్రులు ఫయాజ్ గురించి తెలిసి.. అతడ్ని సంప్రదించారు. హైదరాబాద్ కు అతన్ని రావాలని కోరారు. గుర్తింపు పత్రాలు లేకున్నా ఫర్లేదని.. తాము మేనేజ్ చేస్తామని చెప్పారు.
వీసా.. ఇతర పత్రాలు ఏమీ లేకున్నా 2022 నవంబరులో పాక్ నుంచి నేపాల్ కు వెళ్లిన అతడు.. అక్కడి నుంచి అమ్మాయి తల్లిదండ్రులను కాఠ్మాండులో కలిశాడు. కొందరి సాయంతో సరిహద్దులు దాటేసి భారత్ కు వచ్చేశాడు. హైదరాబాద్ చేరుకున్న అతడు.. కిషన్ బాగ్ లో ఉండటం షురూ చేశాడు. అతడికి అక్రమ పద్దతిలో ఆధార్ ఇప్పించటం ద్వారా స్థానికుడిగా మార్చేలా ప్లాన్ చేశారు.
ఇందులో భాగంగా మాదాపూర్ కు వెళ్లి.. అతన్ని తమ కుమారుడిగా పేర్కొంటూ.. మహ్మద్ గౌస్ పేరుతో రిజిస్టర్ చేసే ప్రయత్నం చేశారు. ఇందులో బాగంగా ఒక డూప్లికేట్ బర్త్ సర్టిఫికేట్ ను సమర్పించారు. అయితే.. ఫయాజ్ తీరు అనుమానాస్పదంగా ఉండటంతో స్థానికులు అలెర్టు అయ్యారు. ఆ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు.. అతడ్ని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు గుట్టు మొత్తం రట్టైంది. ఈ సమాచారం అందుకున్న కౌంటర్ ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగింది. ఈ వ్యవహారంలో కుట్ర కోణం ఏమైనా ఉందా? లేదంటే భార్య కోసమే అక్రమంగా హైదరాబాద్ లో నివసించాడా? అన్నదిప్పుడు ప్రశ్నలుగా మారాయి. ఇక.. తప్పుడు మార్గంలో సరిహద్దులు దాటించిన అత్తమామల్ని అదుపులోకి తీసుకొనేందుకు ప్రయత్నించగా.. వారు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నారు.